Vijayasai Reddy: కొత్త పాత్రలో విజయసాయిరెడ్డి..! పూర్తి బట్టలు విప్పేస్తా...!
ఏపీలో వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఇప్పటికీ రాజకీయాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంపీ పదవి వదిలేశాక పూర్తిగా సైలెంట్ అయిపోతారని భావించిన సాయిరెడ్డి.. వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టడంతో ఇప్పుడు ఆయనకు కౌంటర్లు కూడా మొదలయ్యాయి. దీంతో ఆయన తిరిగి స్పందిస్తున్నారు.
వైసీపీ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు తాజాగా గోవా నుంచి వస్తుండగా అరెస్టు చేశారు. ఆయన్ను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరె్డికి ఉచ్చు బిగించేందుకు సహకరిస్తున్న విజయసాయిరెడ్డిపై ఆయన మండిపడుతున్నారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కెసిరెడ్డేనంటూ గతంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా సిట్ ఆయన్ను సాక్షిగా పిలిపించి విచారణ జరిపింది. ఇందులో సాయిరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా కెసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ లోపు సాయిరెడ్డి కామెంట్స్ పై స్పందిస్తూ ఆడియో విడుదల చేసిన కెసిరెడ్డి విజయసాయిరెడ్డిని బట్టేబాజ్ అన్నారు. తన కేసు వ్యవహారం తేలగానే సాయిరెడ్డి అక్రమాల్ని బయటపెడతానంటూ ప్రకటించారు. కానీ ఆలోపే ఆయన అరెస్టు అయ్యారు. దీంతో సాయిరెడ్డి ఇవాళ స్పందించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అంటూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారంటూ కెసిరెడ్డిపై సాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025
తాను ఏ రూపాయి ముట్టలేదని, లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. తద్వారా మద్యం కుంభకోణంలో మిగతా వివరాలు బయటపెడతానంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. ఇప్పటికే రాజ్ కెసిరెడ్డిని విచారించడం ద్వారా వైసీపీ పెద్దల పాత్రను బయటికి లాగేందుకు సీఐడీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సాయిరెడ్డి కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాయిరెడ్డి నోరు విప్పితే వైసీపీ కీలక నేత, ఆయన కుమారుడు బుక్కయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications