ఉచిత బస్సులు కావాలని మహిళలు అడిగారా? చంద్రబాబు, రేవంత్ లకు సూటి ప్రశ్న!
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు పోటీపడి మరీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మొదట ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇక గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మహిళలకు హామీ ఇచ్చి ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు సేవలను అందిస్తోంది.
మహిళలు ఉచిత బస్సులు అడిగారా?: వెంకయ్య నాయుడు
అయితే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు. నేడు గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన సేవాజ్యోతి పురస్కార ప్రదాన ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఉచితాలు ఇవ్వమని ఎవరడిగారు అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అందిస్తున్న ఉచిత పథకాలను ఉద్దేశించి ఉచిత బస్సు ఇవ్వండి అందులో మేము తిరుగుతాం అని మహిళలు అడిగారా అంటూ ఆయన సూటి ప్రశ్న వేశారు.

ఉచిత పథకాలు ఇవ్వటం సరికాదు
మరి ప్రభుత్వాలు ఎందుకు ఇటువంటి పథకాలను తీసుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం సంపదను సృష్టించే మార్గాలను చూడాలి కానీ అప్పులు చేసి ఉచిత పథకాలు ఇవ్వడం సరికాదని వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏది ఉచితంగా ఇవ్వకూడదు అనేది తన అభిప్రాయమని ఆయన తెలిపారు.
ఉచితంగా ఇవ్వాల్సింది ఇవి మాత్రమే
ఉచిత పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతులను చేసి, ఆపై వారిని తాగుడుకు బానిసలను చేసి, ప్రభుత్వాలు మళ్లీ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇది భయంకరమైన నిజమని ఆయన అభిప్రాయపడ్డారు.పేద ప్రజలకు విద్య మరియు వైద్యం మాత్రమే ఉచితంగా అందించాలని, మిగతావి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాల సీఎంలు ఆలోచించాలి
ఈ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలన్నారు. ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, అప్పుల ఊబిలోకి రాష్ట్రాలను నెట్టేస్తాయని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అంతే కాదు పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహించకూడదు అన్నారు. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ఆ పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేయాలన్నారు. తాజాగా ఉచితాలపైన వెంకయ్య నాయుడు చేసిన కామెంట్స్ అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications