గన్నవరంలో ఉద్రిక్తత.. చెప్పులు, రాళ్ళతో కొట్టుకున్న వల్లభనేని వంశీ, యారగడ్డ వెంకట్రావు వర్గీయులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ వేళ అనేక ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికలు దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మాచర్ల, పుంగనూరు, తాడిపత్రి, రైల్వే కోడూరు వంటి ప్రాంతాలలో జరిగిన దాడులు, విధ్వంసాల ఘటనలు ఏపీలో ఎన్నికల హింసకు అడ్డం పడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలో కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
గన్నవరంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
ఏపీలో పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ వర్గీయులకు ప్రతిపక్ష టీడీపీ, జనసేన వర్గీయులకు మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలు చోటు చేసుకోగా ఇప్పటికే పలువురు గాయపడ్డారు. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్న గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో టిడిపి వైసిపి వర్గీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

చెప్పులు, రాళ్ళతో దాడి
వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గీయులు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వారి వారి కార్లలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుండి పంపించారు.
గన్నవరంలో వైసీపీ వర్సెస్ జనసేన నేతలు
మరోవైపు వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి బాపులపాడు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారని జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉధృతంగా మారుతున్న క్రమంలో పోలీసులు వారి ఇద్దరికీ సర్దిచెప్పి అక్కడి నుండి పంపించేశారు.
గన్నవరంలో పోలీసులు అప్రమత్తం
ఇక ఈరోజు పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా పోలీసులు మొహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నేతల కదలికలపై నిఘా పెట్టారు. మరోవైపు చివరి గంటల్లో ఓటర్లను ప్రలోభపెట్టి ఓటు వేయించుకోవాలని గన్నవరంలో రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా గన్నవరంలో పోలింగ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications