తిరుమలలో అరుదైన ఘట్టం
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 87,536 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 35,120 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. ఈ నెలలో రెండుసార్లు గరుడ వాహనసేవను నిర్వహించబోతోంది టీటీడీ. ఒకటి- గురు పౌర్ణమి నాడు, మరొకటి- గరుడ పంచమి. ఈ పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది.
ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతాడు. నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే నెల 29వ తేదీన గరుడ పంచమి. ఈ పండగను పురస్కరించుకుని.. మరోసారి మలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై అశేష భక్తజనులను కరుణిస్తాడు.
ఈ రెండు సందర్భాల్లో కూడా సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు.
ఈ నెల 7వ తేదీన శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం, 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 28న శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 29న గరుడ పంచమి, శ్రీవారి గరుడసేవ వేడుకలు ఉంటాయి. 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications