నిద్రలేని రాత్రులు గడిపా. సీఎం చంద్రబాబు సంచలనం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు... కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా సీఎం తనిఖీ చేశారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు
పోలవరం ప్రాజెక్టుపై మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. గతంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి అయ్యింటే... రూ.440 కోట్లతోనే నిర్మాణం జరిగేదని వెల్లడించారు. ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేదని వెల్లడించారు. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా కూడా నాటి ప్రభుత్వం దానిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుందని.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఆరేడేళ్లు జాప్యం అయిందన్నారు . జాప్యం కావడం వల్ల ఖర్చులు పెరిగాయని వివరించారు. అనంతరం డయాఫ్రం వాల్ నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్ల భారం పడిందని చెప్పుకొచ్చారు. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు

మెయిన్ డ్యాం దాదాపు పూర్తి..
"పోలవరం మెయిన్ డ్యాం దాదాపు పూర్తి అయింది. ఎంబాంక్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించాం. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశాం. పునరావాసం కోసం అవసరమైన భూ సేకరణ కూడా త్వరితగతిన చేపట్టాలని సూచించాం. అతిపెద్ద ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం కుడి, ఎడమ కాలువలు... టన్నెళ్ల ద్వారా కనెక్టివిటీ పెంచుతాం. ఎడమ కాలువ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ వరకు పోలవరం నీళ్లను తీసుకెళ్తాం. విశాఖ, అనకాపల్లి జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. అలాగే పోలవరం కాలువల ద్వారా పారే గోదావరి జలాలతో దారి పొడుగునా ఉన్న మైనర్ ఇరిగేషన్, చెక్ డ్యాంలను నింపుతూ వెళ్తాం." అని చెప్పారు.
రాయలసీమకు నీటిని తరలించడం సాధ్యమైంది
పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేయగలిగామన్న సీఎం చంద్రబాబు కృష్ణా డెల్టాకు నీరు అందించగలిగామని తెలిపారు.. గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకువెళ్లామని.. అక్కడ నీటిని పొదుపు చేసి సీమకు కృష్ణా జలాలు వెళ్లేలా చేశామని వెల్లడించారు. దీని వల్ల రాయలసీమకు నీటిని తరలించడం సాధ్యమైందన్నారు. ఉద్యాన రంగం అభివృద్ధి చెందుతోంది అన్నారు. రాయలసీమలో రిజర్వాయర్లు అన్నింటినీ నింపామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు అన్నీ పూర్తయ్యేలా చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పని చేస్తున్నామని తెల్చి చెప్పారు.
గత వైసీపీ హయాంలో కేవలం 2 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై వైసీపీ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. నేడు అదే పట్టిసీమ లేకుంటే రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని ఉద్ఝాటించారు.
ఇది నా కల.
"పోలవరం పూర్తి కావాలి... నదులు అనుసంధానం చేయాలి... కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి... ఇది నా కల. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో ముంచేసింది... నిద్రలేని రాత్రులు గడిపా. అంతగా పోలవరం ప్రాజెక్టు నా మనస్సుకు దగ్గరగా ఉంది"












Click it and Unblock the Notifications