బిల్ గేట్స్, మస్క్ మర్చిపోతున్న లాజిక్ ..! ఏఐ పితామహుడు హింటన్ షాకింగ్ ..!
కృత్రిమ మేథ రాకతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండే చర్చలు జరుగుతున్నాయి. అది ఉద్యోగాల కోత లేదా కొత్త ఉద్యోగాల రాక. కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ ను తీసుకొచ్చి ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. మరోవైపు ఏఐ నైపుణ్యాలతో కొత్త ఉద్యోగాల రాక కూడా ప్రారంభమైంది. దీంతో ఉద్యోగాలు పోతాయన్న భయాలు కాస్త తగ్గుతున్నాయి. అలాగే టెక్ దిగ్గజ కంపెనీల బాస్ లు, మాజీ బాస్ లు సైతం ఏఐతో పెద్ద సమస్యలు లేవని తేల్చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏఐ పితామహుడిగా పేరున్న జెఫ్రీ హింటన్ కృత్రిమ మేథ వల్ల జరగబోతున్న నష్టాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఆయన బిల్ గేట్స్ , ఎలాన్ మస్క్ వంటి మేథావుల ఆలోచనల్ని సైతం తప్పుబట్టారు. కొంత వరకూ వీరి అంచనాలు సక్రమంగానే ఉన్నా.. మరో కోణాన్ని మాత్రం వీరిద్దరూ విస్మరిస్తున్నారని హింటన్ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు హింటన్ విశ్లేషణపై చర్చ జరుగుతోంది.

గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐగా పేరుపొందిన జెఫ్రీ హింటన్.. కృత్రిమ మేథ వల్ల భారీ నిరుద్యోగ సమస్య పొంచి ఉందని, కొత్తగా సృష్టించే ఉద్యోగాలు ఈ నష్టాన్ని భర్తీ చేయలేవని హెచ్చరిస్తున్నారు. అయితే బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ లాంటి టెక్ నాయకులు మాత్రం భవిష్యత్తులో చాలా పనులకు మనుషుల అవసరం ఉండదని, ఎక్కువ మందికి పని చేయాల్సిన అవసరం కూడా లేకపోవచ్చని చెప్పుతూ, దాన్ని ఒక రకంగా సానుకూలంగా చూపుతున్నారు.

దీన్ని హింటన్ తప్పుబట్టారు. బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ మర్చిపోతున్న అసలు సమస్య ఏంటంటే ఈ మార్పు దశలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతే వచ్చే ఆర్థిక కల్లోలం, అసమానతలు, సమాజంపై పడే ప్రభావం గురించే ముందుగా ఆలోచించాలని హింటన్ కుండబద్దలు కొట్టేశారు. భారీ ఎత్తున ఉద్యోగాలు పోవడం వల్ల తలెత్తే సమస్యలు కొత్త ఉద్యోగాలు భర్తీ చేసే వాటితో పోలిస్తే చాలా ఎక్కువనేది ఆయన అభిప్రాయంగా ఉంది.












Click it and Unblock the Notifications