ఏపీ, తెలంగాణా ప్రయాణికులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన రైల్వే
భారతీయ రైల్వే ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సేవలను తీసుకువస్తోంది. ముఖ్యంగా రైల్వేస్ కు సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కూడా తీసుకువస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తోంది.
ప్రయాణికులకు శుభవార్త
తాజాగా రైల్వే ప్యాసింజర్లకు మరొక శుభవార్త చెప్పింది. రైల్వే పార్సిల్ కార్యాలయాలలో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైల్వే పార్సిల్ కార్యాలయాలలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం డిజిటల్ చెల్లింపులను పెంచడం కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఆరు డివిజన్లోని రైల్వే స్టేషన్లలోని 35ప్రధాన పార్సిల్ కార్యాలయాలలో క్యూఆర్ కోడ్ ద్వారా చార్జీలు చెల్లించే అదనపు సౌకర్యాన్ని తీసుకువచ్చింది.

ఈ డివిజన్ లలో పార్సిల్ కార్యాలయాలలో కొత్త సేవలు
దీనివల్ల పార్సిల్ కార్యాలయాలలో ప్రయాణికులకు చెల్లింపులు సులభతరం చేసింది. సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, బీదర్, కాజీపేట, లింగంపల్లి, ఇక హైదరాబాద్ డివిజన్లోని నిజామాబాద్, కాచిగూడ, విజయవాడ డివిజన్లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, గుడివాడ, తెనాలి, గూడూరు, కాకినాడ టౌన్, కాకినాడ పోర్ట్, నర్సాపూర్, మచిలీపట్నం స్టేషన్లలో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల విధానాన్ని తీసుకువచ్చింది.
క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు
అంతే కాదు గుంతకల్లు డివిజన్లోని కడప, అనంతపురం, రాయచూర్, ధర్మవరం, తిరుపతి, గుంతకల్, రేణిగుంట, ధోనే, ఇక చిత్తూరు డివిజన్లో నంద్యాల, గుంటూరు డివిజన్లోని గుంటూరు ఇతర స్టేషన్లలో పార్సిల్ కార్యాలయాలలో ఈ సర్వీసులను పొందవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సదుపాయాన్ని పార్సిల్ కార్యాలయాలలో అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది.
సులభతరమైన సురక్షితమైన చెల్లింపు విధానంతో బెనిఫిట్స్
ఈ కొత్త సదుపాయంతో పార్సిల్ బుకింగ్ లావాదేవీని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని కూడా తగ్గించవచ్చని పేర్కొంది. ఇక నగదు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను నివారించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించింది. సులభతరమైన సురక్షితమైన ఈ చెల్లింపు విధానంతో రైల్వే ద్వారా పార్సిల్స్ ను వివిధ ప్రాంతాలకు పంపించడానికి అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అభిప్రాయ పడింది.
ప్రయాణికుల సౌకర్యాలకే రైల్వే ప్రాధాన్యం
రైల్వేకు సంబంధించి వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేస్తున్న రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం పైనే ఫోకస్ చేస్తుందని తాజా ప్రకటన ద్వారా తేటతెల్లం చేసింది. ఇప్పటికే ప్రయాణికుల కోసం ఎన్నో వసతులు కల్పిస్తున్న రైల్వే చెల్లింపుల విషయంలో డిజిటల్ విధానం తీసుకురావటం నిజంగా శుభ సూచకం.












Click it and Unblock the Notifications