ఏపీలో కొత్త జంటలకు శుభవార్త.. రేషన్ కార్డు కావాలంటే అలా చెయ్యాల్సిందే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెళ్లయిన జంటలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల విషయంలో కొత్త జంటలకు తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధివిధానాలను రూపొందించడం మాత్రమే కాకుండా రేషన్ కార్డుల రంగులు కూడా మార్చనుంది. ఏపీలో త్వరలో అందరికీ పాత కార్డులు మార్చి కొత్త కార్డులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది ఏపీ సర్కార్.
ఏపీలో ఉన్న రేషన్ కార్డులు ఇలా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి 48 లక్షల 43 వేల 671 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89 లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకులను అందిస్తోంది. మిగిలిన 59,43,671 కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులను భరిస్తోంది. ఈ రేషన్ కార్డులకు కూడా కేంద్రం రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

నూతన జంటలకు రేషన్ కార్డులు ఇలా
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే వారికి కొత్త కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెళ్లయ్యి తల్లిదండ్రుల కార్డులో పేర్లు ఉన్నవారు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారికి పెళ్లి జరిగిందని వివాహ ధ్రువపత్రాన్ని సమర్పించి రేషన్ కార్డును పొందవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
నవ దంపతులకు శుభవార్త చెప్పిన మంత్రి నాదెండ్ల
దీంతో పెళ్లి చేసుకున్నట్టు వివాహ సర్టిఫికెట్ ఉంటే చాలు.. వారికి రేషన్ కార్డు ఇవ్వనున్నారు. నవ దంపతులు కుటుంబాల నుంచి వేరుపడిన తర్వాత పెళ్లి సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నూతనంగా పెళ్లి చేసుకున్న వారు రేషన్ కార్డుల కోసం ఇబ్బంది పడుతున్నట్టుగా గుర్తించామని, ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కచ్చితంగా రేషన్ కార్డులను జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి రెడీ అవుతోంది. సాధ్యమైనంత త్వరగా రేషన్ కార్డులు జారీ చేయాలని కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే క్రమంలో ఏపీలో రేషన్ కార్డులు లేని నిరుపేదలకు, కొత్తగా పెళ్లి చేసుకున్న నవ దంపతులకు రేషన్ కార్డులు ఇవ్వనున్నారు అధికారులు.












Click it and Unblock the Notifications