జనరల్ బోగీలో ప్రయాణించేవారికి రైల్వే శుభవార్త
భారతీయులకు, రైల్వేలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో, సురక్షితంగా గమ్యాన్ని చేర్చగలిగేవి రైళ్లే అని ప్రజల బలమైన అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే ఎక్కడైనా, ఏదైనా పని ఉంటే రాత్రిపూట చక్కగా స్లీపర్ లో నిద్రించి ఉదయాన్నే పని చక్కబెట్టుకొని తిరిగి వచ్చేవారు కోకొల్లలు. అటువంటి రైల్వే కూడా ప్రయాణికులను వర్గాలుగా విభజించి తేడా చూపిస్తోందంటూ ఎన్నో విమర్శలున్నాయి.
జనరల్ బోగీలు రైలు ఇంజన్ దగ్గర ఒకటి, చివరలో ఒక బోగీ మాత్రమే ఉంటోంది. ఏదైనా స్టేషన్ లో రైలు ఆగినప్పుడు కనీసం మంచినీళ్ల సీసా కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉండదని, జనరల్ బోగీల్లో ప్రయాణించేవారిపై రైల్వే తీవ్ర అలసత్వాన్ని చూపుతోందని రైల్వే యూజర్స్ అసోసియేషన్ విమర్శిస్తోంది. కరోనా తర్వాత పట్టాలెక్కిన ప్రతి రైలుకు జనరల్ బోగీలు తగ్గించి థర్డ్ ఏసీ బోగీలు యాడ్ చేసుకుంటూ వస్తోంది.

జనరల్ బోగీలో ప్రయాణమంటేనే ప్రత్యక్షంగా నరకాన్ని చూడాలనే స్థితికి తెచ్చింది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేవారికి కేంద్రం శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల్లో ప్రయాణికులకు పలు స్టేషన్లలో ట్రాలీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా రైలు స్టేషన్ లో ఆగినప్పుడు సత్వరమే వారికి కావల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కలుగుతోంది.
అంతేకాకుండా క్రమేణా స్లీపర్ రిజర్వేషన్ బోగీలు తగ్గించి థర్డ్ ఏసీ బోగీలు పెంచడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్లు బుక్ చేసుకునే విధానాన్ని బట్టి తారతమ్యం చూపిస్తోందని, జనరల్ బోగీతోపాటు నాన్ ఏసీ రిజర్వేషన్ లో ప్రయాణించేవారిపై చిన్నచూపు చూస్తోందంటున్నారు.

దీంతో అందరినీ సమానంగా చూస్తామనే అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఏసీ బోగీల్లో, రిజర్వేషన్ బోగీల్లో, స్లీపర్ క్లాస్ లో ప్రయాణికులకు అన్నివిధాలుగా ఒకేరకమైన సేవలు తీసుకురావాలని రైల్వే భావిస్తోంది. కాలానుగుణంగా మార్పులు చేపట్టి అందరూ సమానమే అని చెబుతామంటున్నారు. వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications