తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త: ఏప్రిల్ 1నుండి సేవా, దర్శనం టికెట్లతో పాటు వసతి!!
కలియుగ ప్రత్యక్ష దైవం, సప్తగిరులపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే భక్తులకు టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడిన ఆయన వారి నుంచి ఉత్పన్నమైన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శ్రీవారి సేవకు యువత తరలిరావాలని పిలుపునిచ్చారు.
యువకులైన శ్రీవారి సేవకులు క్యూలైన్ల లోను, శ్రీవారి ఆలయంలోని భక్తులకు సేవలు అందించడం కోసం ముందుకు రావాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇక టికెట్లు బుక్ చేసుకునే విషయంలో వసతి గురించి ప్రశ్నించిన ఓ భక్తుడికి సేవా, దర్శనం టికెట్ లతోపాటు ఆన్లైన్ లో అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకోవడం వల్ల వసతి కూడా అందుబాటులోకి వస్తుందని సమాధానం ఇచ్చారు.

ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. ఇటీవల కాలంలో తిరుమల స్వామి వారి సేవా, దర్శన టికెట్లు చాలా త్వరగా అయిపోతున్నాయి అని, శ్రీవారిపై ఉన్న అచంచలమైన భక్తి ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఆన్లైన్లో టికెట్లను అందించే వ్యవస్థను చాలా పారదర్శకంగా, పటిష్టంగా, అద్భుతంగా చేస్తున్నామని ప్రకటించారు.
తిరుమల శ్రీవారిని దగ్గరగా దర్శించుకునేందుకు విఐపి సిఫార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి బ్రేక్ దర్శనం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించేందుకు 60 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు రావాలన్నారు.
గతంలో శ్రీవారి సేవకులు సుపథం ద్వారా వెళ్లి దర్శించుకునే వారని, అయితే ప్రస్తుతం 300 రూపాయల క్యూ లైన్ లో శ్రీవారి సేవకులకు దర్శనం కల్పిస్తున్నామని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సేవకులకు అవగాహన కలగడానికి రెండు రోజులు పడుతుంది కాబట్టి శ్రీవారిసేవ 7 రోజులుగా నిర్ణయించామన్నారు. గతంలో 50 సంవత్సరాల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గృహాలను ఆధునీకరిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications