విశాఖకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.222 కోట్లు విడుదలకు ఎన్‌డీఎంఏ ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరుసగా శుభవార్తలు చెబుతూనే ఉంది. ఇప్పటికే ఏపీలో రోడ్డు రవాణా, రైలు మార్గాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించిన కేంద్రం, ఏపీకి ఇటీవల నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కూడా మంజూరు చేస్తూ ప్రకటన చేసింది. తాజాగా కేంద్రం మరో శుభవార్త చెప్పింది. విశాఖపట్నం తీర ప్రాంత రక్షణకు కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి తమ వంతుగా సహాయం అందిస్తోంది.
222 కోట్ల రూపాయల నిధులు ఇవ్వటానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
సముద్రతీర కోతను నివారించాలని ఉద్దేశించిన నిర్మాణాల కోసం 222.22 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో విశాఖ తీర ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టనున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సముద్ర తీర ప్రాంతంలో కోతను తగ్గించడానికి ప్రణాళికలను రూపొందించింది. ఇక దీనికోసం కేంద్రం నిధులు ఇస్తున్న క్రమంలో 30కిలోమీటర్ల తీరప్రాంతాన్ని రక్షించడానికి చర్యలు చేపట్టింది.

తీరప్రాంత కోత నివారణ ప్లాన్ కు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఆమోదం
విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రూపొందించిన సమగ్ర నివేదికను రాష్ట్ర విపత్తు నిర్వహణ అధారిటీ పరిశీలించి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి పంపించింది. ఈ నివేదికను పరిశీలించిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించిన 222 కోట్లతో కూడిన తీరప్రాంత కోత నివారణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిధులలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో తీర ప్రాంతం 16% కోత
మిగిలిన 10 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. బంగాళాఖాతంలో అలల తీవ్రత పెరిగినప్పుడు విశాఖపట్నం తీర ప్రాంతం కోతకు గురవుతుంది .ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో తీర ప్రాంతం కోతకు 16% గురైనట్లుగా నమోదయింది. 1990 నుండి 2018 వరకు 22.4శాతం తీరం కోతకు గురవగా 41శాతం స్థిరంగా ఉంది. అలాగే 37.5% ప్రాంతంలో కొత్త ఇసుక మేటలు ఏర్పడ్డాయి.
కేంద్ర నిధులతో చేసే పనులు ఇవే
ఇదిలా ఉంటే విశాఖలో సముద్రతీరం 16% కోతకు గురైన దానిని కేంద్రం ఇచ్చిన నిధులతో నిర్మాణాలు చేయనున్నారు. ఈ నిధులతో పెద్ద జాలరి పేట, మంగమారి పేట, భీమిలి ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. సముద్రపు గోడలు నిర్మిస్తారు. ఈ నిధులతో ఆర్. కే బీచ్ లో రిటెన్షన్ గోడ, గోకుల్ పార్క్ వద్ద గ్రోయిన్ నిర్మాణం చేయనున్నారు. ఋషికొండ, చేపలుప్పాడు వంటి ప్రాంతాలలో ఇసుక మేటలను పునరుద్ధరించనున్నారు.
ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం
ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో తీరప్రాంత కోత వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించగలదు అని భావిస్తున్నారు. ఏది ఏమైనా కేంద్రం తీరప్రాంత కోత నివారణకు నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఏపీకి శుభవార్త.












Click it and Unblock the Notifications