మహాశివరాత్రి వేళ శుభవార్త: ఏపీకి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ట్రయల్ రన్ నేడే!!
మహా శివరాత్రి వేళ భారతీయ రైల్వే మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో పరుగులు తీస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు త్వరలో పరుగులు పెట్టనుందని ప్రకటన చేసింది. అంతేకాదు మహాశివరాత్రి పర్వదినం రోజు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ట్రయల్ రన్ నిర్వహించి, త్వరలో ప్రారంభించడానికి రెడీ అయింది.
భువనేశ్వర్- విశాఖ- భువనేశ్వర్ వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి త్వరలోనే ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్టు పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈనెల 12వ తేదీన వర్చువల్ విధానంలో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక నేడు వందే భారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించడానికి రైల్వే శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సోమవారం మినహాయించి వారానికి ఆరు రోజులపాటు ఈ వందే భారత్ రైలు భువనేశ్వర్ విశాఖ మధ్య పరుగులు పెట్టనుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు ఈ రైలు బయలుదేరుతుంది. మొత్తం 443 కిలోమీటర్ల మేర ఈరోజు ప్రయాణిస్తుందని రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
ఇక ఈ రైలు ప్రారంభం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖకు చేరుకునే వరకు వివిధ హాల్టింగ్ పాయింట్ల వివరాలలోకి వెళితే వందే భారత్ రైలు ఉదయం భువనేశ్వర్లో ఐదు గంటల 15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ వందేభారత్ రైలు ఖుర్ధారోడ్ కు 5.33గంటలకు, బరంపూర్-7.05 నిమిషాలకు చేరుకుంటుంది.
అక్కడినుండి ఇచ్ఛాపురం-7.18 నిమిషాలకు, పలాస-8.18 నిమిషాలకు, శ్రీకాకుళం రోడ్ ఆముదాల వలసకు-9.03 నిమిషాలకు చేరుకుంటుంది. ఆపై విజయనగరం-9.48 నిముషాలకు, విశాఖపట్నానికి ఉదయం 11 గంటలకు చేరుతుంది. తిరిగి విశాఖపట్నం నుంచి సాయంత్రం 3.45 గంటలకు బయల్దేరుతుంది. విజయనగరం-4.30 నిముషాలకు, శ్రీకాకుళం రోడ్-5.28 నిముషాలకు , పలాస-6.30 నిమిషాలకు చేరుకుంటుంది.
ఇచ్ఛాపురం-7.00 గంటలకు, బరంపూర్-7.20 నిముషాలకు, ఖుర్ధారోడ్-8.57 నిమిషాలకు, భువనేశ్వర్-9.30 గంటలకు చేరుకుంటుందని అధికారులు ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు. ఇక ప్రారంభం నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు ప్రతి రైల్వేస్టేషన్ వద్ద ఈ రైలుకు రెండు నిమిషాల పాటు హాల్టింగ్ ఉంటుంది.












Click it and Unblock the Notifications