Rajadhani Files: "రాజధాని ఫైల్స్" విడుదలపై హైకోర్టు కీలక నిర్ణయం...!
ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.ఈ చిత్రం విడుదల నిలిపేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిన్న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఇవాళ మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానులు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం కథాంశంగా తెరకెక్కిన రాజధాని ఫైల్స్ విడుదల ఆపాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ రెండో రోజు విచారణ జరిపిన హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ చిత్రం విడుదలకు అభ్యంతరాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ తో పాటు రివ్యూ కమిటీ జారీ చేసిన క్లియరెన్స్ ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. తీర్పు వెలువరించింది.

నిన్న రాజధాని ఫైల్స్ విడుదలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం రెవెన్యూ అధికారుల్ని పంపి అప్పటికే చిత్రం ప్రదర్శిస్తున్న ధియేటర్ల వద్ద నిలుపుదల చేయించింది. దీంతో విజయవాడ, గుంటూరుతో పాటు పలు చోట్ల అప్పటికే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. ఇవాళ హైకోర్టు నిన్న ఇచ్చిన స్టే ఎత్తేయడంతో థియేటర్లు, మల్టిప్లెక్స్ లలో యథావిథిగా షోలు ప్రదర్శించనున్నారు.
ఏపీలో అమరావతి స్ధానంలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ స్ధానిక రైతులు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువన్ వెబ్ సైట్ కు చెందిన నిర్మాణ సంస్ధ ఈ పోరాటాన్ని రాజధాని ఫైల్స్ పేరుతో తెరకెక్కించింది. ఇందులో సీఎం జగన్, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్ తో పాటు పలు పాత్రలు ఉన్నాయి. వీటిలో కొడాలి నాని సహా పలు పాత్రల్ని అనుచితంగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ హైకోర్టు తీర్పు ప్రకటించింది.












Click it and Unblock the Notifications