ఏపీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్-ఇక ఎయిమ్స్ లోనూ..
ఏపీలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో రైల్వే, పోస్టల్ తో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరు చాలా కాలంగా కేంద్రానికి ఓ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం లభిస్తున్న ఆరోగ్య సేవలకు తోడు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలోని ఎంప్యానల్డ్ ఆస్పత్రుల జాబితాలో ప్రతిష్టాత్మక జాతీయ వైద్య పరిశోధన సంస్ధ ఎయిమ్స్ ను కూడా చేర్చాలని కోరుతున్నారు.
ఏపీ విభజన తర్వాత కేంద్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పేదలకు కేవలం 10 రూపాయల ఛార్జీతో ఎన్నో వైద్య సేవలు అందుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ ఎంప్యానల్డ్ ఆస్పత్రుల జాబితాలో మాత్రం ఇప్పటివరకూ ఎయిమ్స్ కు చోటు దక్కలేదు. దీంతో ఎయిమ్స్ లో వారికి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఇచ్చే సీజీహెచ్ఎస్ కార్డులు పనికి రావడం లేదు. ఈ నేపథ్యంలో వారు ఎయిమ్స్ ను కూడా ఎంప్యానల్డ్ ఆస్పత్రుల జాబితాలో చేర్చాలని ఎప్పటినుంచో కోరుతున్నారు.

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మంగళగిరి ఎయిమ్స్ ను కూడా కేంద్ర ఆరోగ్య పధకం సీజీహెచ్ఎస్ కింద ఎంప్యానల్ చేసిన ఆస్పత్రుల జాబితాలో చేర్చింది. ఈ మేరకు హైదరాబాద్ లోని అదనపు డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ఎంప్యానల్డ్ ఆస్పత్రుల తరహాలోనే మంగళగిరి ఎయిమ్స్ కు వెళ్లి వైద్య సేవలు అందుకోవచ్చు. ప్రతిష్టాత్మక ఆస్పత్రి కావడంతో అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని భావిస్తున్నారు.

కేంద్రం తాజా నిర్ణయతో మంగళగిరి ఎయిమ్స్ లో సీజీహెచ్ఎస్ కార్డు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్వాతంత్ర సమరయోధులకు కూడా ఇక్కడ వైద్య సేవలు లభించనున్నాయి. ఇప్పటికే కేంద్రం ఎంప్యానల్ చేసిన మిగతా ఆస్పత్రులలోనూ వీరికి వైద్యం లభిస్తున్నా, ఎయిమ్స్ కు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications