భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల శ్రీవారి దర్శనానికి విజయవాడ నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీ..
కలియుగ వైకుంఠం దైవమైన శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్క ఏపీనుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పొటెత్తుతారు. ఇక, విజయవాడ నుంచి వచ్చే భక్తులతో పాటు ఆంధ్ర్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఏపీ పర్యాటకశాఖ గుడ్‌న్యూస్ అందించింది. అతి తక్కువ ధరలోనే తిరుమల స్వామివారి దర్శన భాగ్యం పొందొచ్చు. అదికూడా విజయవాడ నుంచి తిరుపతికి ప్రతిరోజూ స్పెషల్ టూర్ ప్యాకేజీనీ ఏపీ పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చింది. తిరుమల స్వామివారి దర్శనానికి ప్లాన్ చేసేవారికి ఇదొక సువర్ణవకాశమని చెప్పుకోవాలి.
ఇక, టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ విజయవాడ నుంచి బయలుదేరుతోంది. ఏసీ స్లీపర్ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో భాగంగా వసతి, భోజనాలు, దర్శనాలను ఏపీ పర్యాటకశాఖ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం రెండు రోజులు భక్తులకు అందుబాటులో ఉంటుంది. నిజానికి వైజాగ్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఏసీ స్లీపర్ బస్సులకు విజయవాడలో కూడా స్టాప్ పాయింట్ ఇవ్వటంతో ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ అమల్లోకి తీసుకొచ్చారు. ఈ టూర్‌లో భాగంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి ఈ బస్సు బయల్దేరుతుంది. ఇక, ఈ బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం బెంజిసర్కిల్ దగ్గర ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్ నెంబర్ 4 దగ్గర ఏపీటీడీసీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సు హాల్ట్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇక్కడికి రావాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. ఈ టూర్ బస్సు తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకు తిరుమల కొండకు చేరుకుంటుంది. భక్తులకు కొండపై వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు.

ప్యాకేజీ ధరలు..
ఉదయం టిఫిన్ పూర్తయ్యాక పదిగంటల సమయంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరుతారు. ఆ తర్వాత భోజనం ముగించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక, అదే రోజు రాత్రి ఏడు గంటలకు రాత్రి భోజనం కూడా ఉంటుంది, అదే నైట్ తిరుపతి నుంచి తిరుగు ప్రయాణానికి బస్సు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం విజయవాడకు చేరుకోవడంతో ఈ ప్రత్యేక టూర్‌ప్యాకేజీ ముగుస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. పెద్దలయితే రూ. 3,970 చెల్లించాలి. పిల్లలకయితే రూ.3,670గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications