పెట్రోల్ ధరలపై ఏపీ కౌంటర్- రూపాయే : బీజేపీ - టీడీపీ చేసిందిదే : వాస్తవాలివే..భారీ ప్రకటనలతో..!!
కేంద్రం పెట్రోలు..డీజిల్ ధరలు తగ్గింపుతో పలు రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకున్నాయి. ఇక, ఏపీలో ప్రభుత్వం సైతం పన్నులు తగ్గించుకొని పెట్రోలు..డీజిల్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. బీజేపీ నిరసనలు మొదలు పెట్టింది. టీడీపీ ఈ నెల 9వ తేదీన నిరసనలకు నిర్ణయించింది. జనసేన ఇప్పటికే ఇదే అంశం పైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక, ఈ సమయంలో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ధరల తగ్గింపు..వాస్తవాల పేరుతో భారీగా పత్రికా ప్రకటనలు విడుదల చేసింది.

పత్రికల్లో ప్రభుత్వం భారీ ప్రకటనలు
సాధారణంగా ప్రభుత్వ పథకాల గురించి ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వం..ఇలా ఒక అంశం పైన వాస్తవాలు ఇవీ అంటూ ప్రకటనలు జారీ చేసింది. అందులో ఎక్కడా పార్టీల పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా..బీజేపీ - టీడీపీ ఏం చేసారనే అంశాలు వెల్లడించే ప్రయత్నం చేసారు. పెట్రోలు..డీజిల్ ధరలను పెంచింది ఎంత .. తగ్గించింది ఎంత అంటూ ఆ ప్రకటనలలో వైసీపీ ప్రభుత్వం తరపున ఆర్దిక మంత్రి బుగ్గన ప్రశ్నించారు. లీటరు పెట్రోల్ ధరను రూ.100 దాటించి రూ.5, రూ.10 తగ్గించామని పెంచినోళ్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా అంటూ నిలదీసింది.

బీజేపీ- టీడీపీ చేసిందేంటో వివరిస్తూ
ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 3,35,000 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,745 కోట్లు మాత్రమేనని, అంటే కేవలం 5.8 శాతం మాత్రమే అని పేర్కొంది.
వాస్తవానికి రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచాల్సి ఉన్నప్పటికీ పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో సుమారు రూ.2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా అంటూ వైసీపీ ప్రభుత్వం బీజేపీని నిలదీసింది.

ధరలు...రాబడి గురించి లెక్కలు
2019 మేలో లీటరు పెట్రోల్ ధర రూ.76.89గా ఉంటే.. 2021 నవంబరు 1 నాటికి రూ.115.99కు చేరందని వివరించింది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు కురవడంతో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని.. దీంతో రూ.2,205 కోట్లతో రోడ్లను బాగుచేస్తున్నామని, ఇందుకోసం తమ ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరు పెట్రోల్‌పై కేవలం ఒక్క రూపాయి మాత్రమే సుంకంగా వసూలు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రాబడిని కోల్పోయింది.

రూపాయి మత్రమే పెంచామంటూ
అయినా ఒక్కసారి ఒక్క రూపాయి తప్ప ఎప్పుడూ పెట్రోలు, డీజిలు మీద పన్నులు పెంచలేదన్నది వాస్తవమని వివరించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా పెట్రో బాదుడు బాది.. ప్రజల నడ్డి విరిచేసి, ఇప్పుడు దాన్ని మరిచిపోయి, తాము పెంచిన పన్నులను తగ్గించాలని కొత్తపాట అందుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నాలు ప్రారంభించిందంటూ ఇప్పటికే మంత్రులు విమర్శలు మొదలు పెట్టారు. తాజాగా చంద్రబాబు సైతం సీఎంను టార్గెట్ చేస్తూ..అధికారంలోకి వస్తే పెట్రోలు..డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ జగన్ నాడు హామీ ఇచ్చారని..ఇప్పుడు దానిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు.

జగన్ ప్రభుత్వం ధరలు తగ్గించేనా
ఇప్పుడు ఈ విషయంలో బీజేపీ..టీడీపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ భారీ పత్రికా ప్రకటనల పైన అటు బీజేపీ..ఇటు టీడీపీ ఏ రకంగా స్పందిస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో పెట్రోలు..డీజిల్ ధరల విషయంలో జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది వేచి చూడాల్సిందే. ఆ రెండు పార్టీల నుంచి వచ్చే స్పందన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications