ఎన్నికల వేళ వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి వాలంటీర్ల వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తోంది. రేషన్ సరుకులను ఇంటింటికీ అందిస్తున్న ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు) వాహనాల వెంట ఉంటున్నందుకు అదనపు ప్రోత్సాహకంగా ప్రతి వలంటీర్‌కు నెలకు రూ.500 చొప్పున అదనంగా చెల్లించాలంటూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు ఒకేసారి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ నిధుల నుంచి ఆ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించటంలో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం మరో ప్రోత్సాహకం ప్రకటించింది.

ఎండీయూ వాహనాల వెంట ఉంటున్నందుకు రూ.500 వలంటీర్లకు అందించాలని ఆదేశించింది. వాస్తవంగా ఎండీయూ వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచే వాటి ద్వారా రేషన్ సరుకులను ఇంటింటికీ సక్రమంగా అందించేలా చూసే బాధ్యతను ప్రభుత్వం వలంటీర్లకే అప్పగించింది.
వలంటీర్లకు వచ్చే మూడు నెలల కాలానికి అదనంగా రూ.750 చొప్పున అందిస్తామని జగన్ గత డిసెంబరులోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ అదనపు మొత్తాన్ని రూ. 500లకు కుదించారు. రాష్ట్రంలోని 1.49 కోట్ల రేషన్‌కార్డుదారులకు రేషన్ సరకులను డోర్ డెలివరీ చేసేందు ప్రభుత్వం కొత్తగా 9,260 ఎండీయూ వ్యాన్లను ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా 60 శాతం సబ్సిడీపై ఎండీయూ వాహనాలను లబ్ధిదారులకు అందించింది. పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్లు ఇప్పుడు ఎండీయూ సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డుల సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ఇక నుంచి నిత్యవసరాల పంపిణీ వాహనాల పనితీరు..ప్రజలకు పంపిణీ తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ప్రజలకు మరింత మెరుగ్గా ఈ సేవలు అందించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications