ఒకే ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు..!
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది నేటి యువతకు ఒక కల. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెల్లు.. లేదా ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్కాతమ్ముడు.. భార్యాభర్తలు.. ఇలా ఓ కుటుంబంలో ఏకంగా ముగ్గురు.. కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన సంఘటనలు చూశాం. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపిక కావడం మాత్రం చాలా తక్కువ గానే చూసుంటాం. ఈ అసాధారణ విషయాన్ని చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వాసులు.
ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం అరుదుగా జరిగే అద్భుతం. ఈ అసాధారణ విజయాన్ని సాధించి, పేదరికాన్ని చదువుతో జయించవచ్చని నిరూపించింది గౌరమ్మ కుటుంబం. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్లు. పదేళ్ల క్రితం భర్త మరణించిన తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజాలపై పడింది.

అయినా మొక్కవోని దీక్షతో గౌరమ్మ కూలీ పనులు చేస్తూ, తన పిల్లలను చదువులో ముందుకు నడిపించారు. పేదరికం, సామాజిక సమస్యలు ఎదురైనా కానీ వారు చదువుపై అంకితభావంతో భవిష్యత్తును కాపాడుకున్నారు. గౌరమ్మ నలుగురు కూతుళ్లు కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లి కలను నిజం చేశారు.
నలుగురు కూతుళ్ల సక్సెస్ స్టోరీ..
వీణ.. 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఈ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తి ఆమె.
వాణి.. 2016లో SGT (సెకండరీ గ్రేడ్ టీచర్) గా ఉద్యోగం పొందింది.
వనజాక్షి.. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది.
శిరీష.. నలుగురిలో చివరి అమ్మాయి అయిన శిరీష కూడా ఇటీవల విడుదలైన డీఎస్సీ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ టీచర్స్) పరీక్షలో SGT పోస్టుకు ఎంపికైంది.
ఈ విధంగా ఒకే కుటుంబం నుంచి నలుగురు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఈ కుటుంబం నిరూపించింది. గౌరమ్మ కుటుంబం చూపించిన ఈ విజయం కేవలం చదువు మాత్రమే కాకుండా, కష్టపడే తత్వం, పట్టుదల, అంకితభావం విజయానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఎలాంటి ఆర్థిక అండ లేకపోయినా, ఈ పిల్లలు విద్యార్జనకు కట్టుబడి కృషి చేసి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం ద్వారా పేదరికాన్ని అధిగమించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో వారికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications