ఉద్యోగులకు గుడ్ న్యూస్ - పెండింగ్ బిల్లులకు నిధుల విడుదల..!!
ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు 700 కోట్లు విడుదల చేసింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం గత మూడు నెలల్లో ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రూ.2100 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం రూ.1000 కోట్లు చెల్లించారని ఐకాస ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో మరో రూ 700 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల అంశంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు నెలకు సంబంధించిన రూ.700 కోట్లను విడుదల చేసింది. జీతాల సప్లమెంటరీ బిల్లులకు సంబంధించిన బకాయిలు రూ.392 కోట్లు, 2024 సెప్టెంబరు వరకు ఉన్న జీపీఎఫ్ బకాయిలు రూ.308కోట్లు కలిపి రూ.700 కోట్లు చెల్లించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులను ఒకేసారి విడుదల చేయలేమని, నెలకు రూ.700 కోట్ల చొప్పున విడుదల చేసి ఏడాదిలోపు బకాయిలు లేకుండా చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున గతంలో హామీ ఇచ్చారు. కానీ, గత మూడు నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలపై స్పందించని ప్రభుత్వంపై ఇక సమరమే అంటూ ఆగస్టు 19న నిర్వహించిన ఐకాస విస్త్రత స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు.

కార్యాచరణలో భాగంగా సెప్టెంబరు 8వ తేదీ నుంచి ఉమ్మడి 10 జిల్లాల్లో బస్సు యాత్ర, అక్టోబరు 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని వెల్లడించారు. దీంతో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐకాస ప్రతినిధులతో గత వారం చర్చలు జరిపింది. అనంతరం ఉద్యోగుల సమస్యల మీద ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగస్టు 22న సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవ్వడానికి దారి తీసిన పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. ఆ మరుసటి రోజే ఐకాస నేతలో మంత్రి భట్టి సమావేశమయ్యారు. అనంతరం సెప్టెంబరు 2న చర్చలకు రావాలని ఉద్యోగ ఐకాసను ప్రభుత్వం ఆహ్వానించింది. తాజాగా బకాయిల చెల్లింపు నిర్ణయం పై జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను ఇదే తరహాలో పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications