"భీమ్లా నాయక్" విడుదల వేళ వివాదం - రాజకీయ అస్త్రంగా : ఏం జరుగుతోంది..!!
ఏపీలో మరో సారి సినిమా వివాదం తెర మీదకు వచ్చింది. ఏపీలో సినీ సమస్యలకు పరిష్కారం లభించింది..ఇక, ఉత్తర్వులే ఆలస్యం అన్నట్లుగా సినీ పెద్దలు చెప్పినా... ఇప్పుడు మరోసారి రగడ మొదలవుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ రేపు (25వ తేదీన) విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తెలంగాణలో రెండు వారాల పాటు భీమ్లా నాయక్ అయిదో షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.
Recommended Video

థియేటర్లకు నోటీసులు
మరో వైపు ఏపీలో మాత్రం చిరంజీవి అండ్ టీం సీఎం జగన్ తో భేటీ సమయంలో తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి రాలేదు. సినిమా అంశాల పైన నియమించిన కమిటీ నివేదిక - సిఫార్సులు- ఆదేశాలు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతొ.. పాత సినిమా ధరలనే భీమ్లానాయక్ కు అమలు చేయాలంటూ జిల్లా అధికారులు సినిమా థియేటర్లకు సూచిస్తున్నారు. పలు జిల్లాల్లో స్థానిక రెవిన్యూ అధికారులు థియేటర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసారు. బెనిఫిట్ షోలు, అదనపు ప్రదర్శనలు వేస్తే.. కఠిన చర్యలు తప్పవంటూ.. అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే.. సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు తప్పవంటూ..కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు తహసీల్దార్ హెచ్చరించారు.

భీమ్లానాయక్ విడుదల వేళ
గుంటూరు జిల్లాలోనూ ప్రస్తుత నిబంధనలు అమలు చేయాలంటూ..తహసీల్దార్లకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. బుధవారం కాకినాడలోని తిరుమల థియేటర్‌లో ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జీవో నంబరు 35 ప్రకారం ఆన్‌లైన్ విధానం ద్వారా టికెట్ల అమ్మకం చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. థియేటర్‌లో టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉండాలని, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణలో అయదు షోలకు
కృష్ణా జిల్లాలో చాలా థియేటర్లకు తహశీల్దార్లు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్ ధరలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని నోటీసులో వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి టీం భేటీ సమయంలో అయిదో షో ప్రదర్శన పైన సానుకూలంగా స్పందించారని భేటీ తరువాత హీరోలు స్పందించారు. అయితే, ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం అయిదో షో ప్రతిపాదన చేయలేదని తెలుస్తోంది.

మరోసారి రాజకీయ వివాదంగా
ఇప్పుడు ఇది ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారుతోంది. జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. అయితే, కొత్త జీవో వచ్చే వరకూ పాత జీవో అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, సీఎం - చిరంజీవి టీం చర్చల సమయంలోనే ఏ సినిమా అయినా ఒకటే ధర ఉంటుందని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఇక, సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో..ఇప్పుడు ఈ వ్యవహారం పైన రాజకీయ పార్టీలు ..టాలీవుడ్ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications