బెజవాడ గన్ మిస్ ఫైర్ కేసు : షాకింగ్ ట్విస్ట్ .. సరదాగా కాదు సీరియస్ గానే హోంగార్డ్ నిర్వాకం
తుపాకీ పేలి హోంగార్డు భార్య మృతి చెందిన ఘటన విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. మొదట భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయిందని అంతా భావిస్తే , సరదాగా కాదు సీరియస్ గానే భార్యను హతమార్చాడని తేల్చారు పోలీసులు. ఇక అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో భర్తే హంతకుడని , పొరబాటున గన్ మిస్ ఫైర్ కాలేదని తేలింది .

ఏఎస్పీ తుపాకీ హోం గార్డ్ చేతిలో మిస్ ఫైర్ .. అనుమానాస్పదంగా భార్య మృతి
సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ వద్ద అసిస్టెంట్ గా హోం గార్డ్ వినోద్ విధులు నిర్వహిస్తున్నారు . మూడు రోజుల క్రితం ఏఎస్పీ శశిభూషణ్ అనంతపురం క్యాంప్ కు వెళ్లారు, దీంతో హోం గార్డ్ వినోద్ వద్ద ఏఎస్పీ తుపాకీ ఉంది. ఆదివారం రాత్రి తన భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయిందని, ఆమె గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోయిందని, దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని హోం గార్డ్ వినోద్ మొదట వెల్లడించాడు.

సరదాగా చూపిస్తుంటే పేలిందని చెప్పిన హోం గార్డ్ ..ఆపై నేరం అంగీకారం
భవానిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ కేసు కొత్త మలుపు తిరిగింది . హోంగార్డ్ వినోద్ తన భార్యను ఉద్దేశపూర్వకంగానే హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. నగల విషయంలో ఇరువురి మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగిందని, ఆ గొడవలో వినోద్ ఉద్దేశపూర్వకంగానే తన భార్యను కాల్చిచంపేశాడని పోలీసులు నిర్ధారించారు. ఇక ఏఎస్పి గన్ కారులో వదిలి వెళ్లడంతో, ఆ గన్ ను తన వెంట తీసుకు వెళ్ళిన వినోద్ భార్య రత్న ప్రభ ను కాల్చి చంపాడని పేర్కొన్నారు.

హోం గార్డ్ వినోద్ , రత్న ప్రభల మధ్య ఘర్షణలు , చంపి కట్టుకథ చెప్పిన హోం గార్డ్
ప్రేమ వివాహం చేసుకున్న వినోద్ , రత్న ప్రభలకు బంగారం తాకట్టు పెట్టిన విషయంలో గొడవలు జరుగుతున్నాయి . ఘర్షణల్లో భాగంగా భార్యపై కోపంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు . అందులో భాగంగానే భార్యను హతమార్చి సరదాగా గన్ చూపిస్తుంటే మిస్ ఫైర్ అయిందని కట్టుకథ అల్లాడు . ప్రస్తుతం మరణించిన హోం గార్డ్ భార్య రత్నప్రభ నాలుగు నెలల గర్భవతి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కీలక ఆధారాలతో హోం గార్డ్ ను అరెస్ట్ చేశారు .












Click it and Unblock the Notifications