గోవిందా.. గోవింద: మార్మోగిన తిరుమలగిరులు
Happy New Year 2025: కొత్త ఏడాది ఆరంభమైంది. 2025లోకి అడుగు పెట్టాయి ప్రపంచదేశాలు. ఒక్కో దేశం ఒక్కో విధంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటోన్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు కోట్లాదిమంది మేల్కొనే ఉన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు.
అర్ధరాత్రి 12 గంటలు కాగానే దేశవ్యాప్తంగా కొత్త ఏడాది ఉత్సవాలు మిన్నంటాయి. బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు జనం. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ.. వంటి నగరాల్లో పండగ వాతావరణం నెలకొంది. కేక్ కట్ చేస్తూ కోలాహలంగా గడిపారు ప్రజలు.

కొత్త ఏడాదిని పురస్కరించుకుని భక్తులు ఆలయాలను సందర్శిస్తోన్నారు. పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. ఈ క్రమంలో గడ్డ కట్టించే చలిని సైతం లెక్క చేయట్లేదు. తెల్లవారు జాము నుంచే గుడుల ముందు బారులు తీర్చి నిల్చొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తోన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయం, అయోధ్య రామమందిరం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి దేవస్థానం, ఒడిశాలోని పూరీ జగన్నాథుడు, తమిళనాడులోని మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. కిటకిటలాడాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. తెల్లవారు జాము నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు జనం. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తోన్నారు.
మంగళవారం రాత్రి నుంచి వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. కొత్త ఏడాది నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల గుండా వందలాది మంది కాలినడకన వచ్చారు. ఎటు చూసినా జనమే కనిపించారు.ఎముకలు కొరికే చలినీ లెక్క చేయలేదు.
రాత్రి నుంచి శ్రీవారి ప్రధాన ఆలయం వద్ద గుమికూడటం ప్రారంభించారు. సరిగ్గా 12 గంటల సమయానికి భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. ఆలయ వెలుపలి ప్రాంగణం మొత్తం నిండపోయింది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు అనే తేడా కనిపించలేదు. మనసారా శ్రీనివాసుడిని ప్రార్థించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందుడి నామస్మరణతో తిరుమలగిరులు మార్మోగిపోయాయి.
అటు వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications