డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్-సీబీఐకి అనుమతివ్వని జగన్ సర్కార్-హైకోర్టు ఆగ్రహంతో యూటర్న్
కరోనాలో తనకు మాస్కులు ఇవ్వలేదని బహిరంగంగా ఆరోపణలు చేసి వైసీపీ సర్కార్ కు టార్గెట్ గా మారి అనంతరం ప్రాణాలు కోల్పోయిన వైజాగ్ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తుకు ఆటంకాలు తప్పడం లేదు. డాక్టర్ సుధాకర్ మృతికి కారకులైన పోలీసులను విచారించేందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది.

డాక్టర్ సుధాకర్ కేసు
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి అనస్తీషియన్ డాక్టర్ సుధాకర్ గతేడాది కరోనా సమయంలో ప్రభుత్వం తగినన్ని మాస్కులు ఇవ్వకపోవడంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. ఆయనకు విపక్ష టీడీపీతో సంబంధాలు ఉన్నాయని, సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ కూడా చేసింది. అనంతరం ఆయన్ను పోలీసులు రోడ్డుపైనే బట్టలూడదీసి లాక్కెళ్లారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతర పరిణామాల్లో ఆయన పిచ్చోడని ముద్ర వేసి పిచ్చాసుపత్రికి సైతం తరలించారు. చివరికి డాక్టర్ సుధాకర్ చనిపోయారు. అయితే అప్పటికే ఆయన్ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై హైకోర్టులో పలు కేసులు దాఖలు కావడంతో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. దీనిపై తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

సుధాకర్ కేసులో మరో ట్విస్ట్
డాక్టర్ సుధాకర్ పై వేధింపులు, మృతి కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ సాధారణ, ఆరోగ్యవంతుడైన డాక్టర్ కాస్తా పిచ్చోడిగా మారిపోవడం, తనకు పిచ్చిలేదని పదే పదే చెప్పుకోవాల్సి రావడం, ప్రభుత్వ వేధింపులకు నిరసనగా హైకోర్టులో కేసులు దాఖలు కావడం ఆ తర్వాత ఆయన మృతి అన్నీ ట్విస్టులే. ఇప్పుడు ఆయన మృతిపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐకి ఏపీ ప్రభుత్వం సహరించకపోవడంతో మరో ట్విస్ట్ తప్పడం లేదు. నేరుగా హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న సీబీఐ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం సహకారం లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.

ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి నిరాకరణ
డాక్టర్ సుధాకర్ కేసులో అందరి కంటే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటోంది పోలీసులే. విశాఖ జిల్లా పోలీసులు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో అతిగా వ్యవహరించడమే ఆయన మృతికి కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా వారిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వం ఇందుకు అనుమతి నిరాకరించింది. సీబీఐ కోరినా పోలీసుల్ని ప్రశ్నించేందుకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అధికారులు హైకోర్టుకు ఇదే విషయాన్ని నివేదించారు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది.

జగన్ సర్కార్ పై హైకోర్టు ఫైర్
డాక్టర్ సుధాకర్ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు విశాఖ పోలీసుల్ని ప్రశ్నించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత కీలకమైన కేసులో పోలీసుల్ని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఎందుకివ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో నేరస్తుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని కూడా వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టులో ప్రభుత్వం ఇరుకునపడింది. ఇన్నాళ్లూ పోలీసుల పాత్రే లేదని వాదిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వారిని సీబీఐ ప్రశ్నించకుండా అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
Recommended Video

అనుమతి అక్కర్లేదన్న జగన్ సర్కార్
అయితే హైకోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వ న్యాయవాది అసలు సీబీఐ ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని చెప్పేశారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగైతే అదే విషయాన్ని మెమో రూపంలో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ మేరకు మెమో సిద్ధం చేసి కోర్టుకు ఇవ్వబోతోంది. అంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే సీబీఐ విశాఖ పోలీసుల్ని ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో హైకోర్టు ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications