నువ్వెంత అంటే నువ్వెంత ? అంబటి వర్సెస్ పోలీసుల వాగ్వాదం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల్ని పోలీసులు అస్సలు లెక్కచేయని పరిస్ధితి. వైసీపీ నేతలపై సానుభూతి చూపితే తాము కష్టాల్లో పడతామని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ మితిమీరిన స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా పోలీసులతో ఎక్కడికక్కడ సై అంటే సై అంటున్నారు. ఇలాంటిదే ఓ ఘటన ఇవాళ గుంటూరు కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో చోటు చేసుకుంది.
వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా రూడ్లపై ర్యాలీలు చేపట్టి అనంతరం కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు గుంటూరు కలెక్టరేట్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. అనంతరం వాగ్వాదానికి కూడా దిగారు.

ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తాను ప్రభుత్వ ఉద్యోగిని అని కూడా మర్చిపోయి రాజకీయ నాయకుడి తరహాలో మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుపై పరుష పదజాలంతో దూషణలకు దిగాడు. అంబటి కూడా అంతే స్పీడుతో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. దమ్ముంటే ర్యాలీని ఆపాలని అంబటి రాంబాబు సవాల్ చేస్తూ ఆపి తీరుతానంటూ సదరు పోలీసు అధికారి కూడా ప్రతిసవాల్ విసిరారు.
దాదాపు పావు గంటసేపు అంబటి రాంబాబు, పోలీసుల మధ్య ఇలా వాగ్వాదం కొనసాగిన తర్వాత అక్కడి నుంచి వైసీపీ నాయకులు కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే నడిరోడ్డుపై మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో పోలీసు అధికారి వాగ్వాదం, బూతుపురాణాలు చూసే వారికి అసహ్యం కలిగించాయి. అయినా వారు చాలా సేపు వెనక్కి తగ్గకుండా వాగ్వాదం కొనసాగించారు.












Click it and Unblock the Notifications