అందుకే జగన్ ను వదిలేసి వెళ్లిపోయా.. ! హెలికాఫ్టర్ పైలట్ షాకింగ్ ..!
ఈ ఏడాది ఏప్రిల్ 8న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనకు వచ్చారు. హెలికాఫ్టర్ దిగగానే జనం ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో హెలికాఫ్టర్ స్వల్పంగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో పైలట్ జగన్ ను తిరిగి తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసి హెలికాఫ్టర్ తో వెళ్లిపోయాడు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఇలా జగన్ ను వదిలేసి ఎందుకు ఆ రోజు వెళ్లిపోవాల్సి వచ్చిందన్న దానిపై విచారణకు పోలీసులు పలుమార్లు పిలిచినా పైలట్ రాలేదు. ఎట్టకేలకు ఇవాళ చెన్నేకొత్తపల్లి పీఎస్ లో విచారణకు పైలట్ అనిక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సదరు హెలికాఫ్టర్ పైలట్ అనిల్ కుమార్ సంచలన వివరాలు బయటపెట్టారు. ఇప్పటికే కోపైలట్ శ్రేయాస్ జైన్ ను విచారించిన పోలీసులు.. ఇవాళ పైలట్ అనిల్ ను అన్ని విధాలుగా ప్రశ్నించారు. దీంతో ఏప్రిల్ 8న తాను వీఐపీ అయిన జగన్ ను వదిలేసి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో పూర్తిగా వివరించారు. అప్పుడు అక్కడకు చేరుకున్న జనం, హెలికాఫ్టర్ ధ్వంసమైన పరిస్ధితులే తాను అలా వెళ్లిపోయేందుకు కారణమైనట్లు తెలిపారు.

ఆ రోజు జగన్ హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన సమయంలో భారీగా జనం గుమికూడారని, లోపల ఉన్న ఆయన్ను పలకరించేందుకు హెలికాఫ్టర్ పై పిడిగుద్దులు కురిపించారని, దీంతో సైడ్ మిర్రర్ విరిగిందని తెలిపారు. అలాగే గాల్లోకి ఎగిరితే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రిటర్న్ లో జగన్ ను తీసుకెళ్లకుండా తానొక్కడినే తిరిగి వెళ్లిపోయినట్లు పైలట్ తెలిపారు. ఇదే విషయాన్ని ఏవియేషన్ సంస్ధకు చెప్పామని, అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇలా వెళ్లిపోయినట్లు వెల్లడించారు.
అయితే జగన్ ను తీసుకెళ్తే ప్రమాదం అని చెప్పి తానొక్కడే ఎలా వెళ్లారని పోలీసులు పైలట్ ను ప్రశ్నించారు. అయితే తాము హెలికాఫ్టర్ ముందు భాగంలో ఉంటాం కాబట్టి కనీస సామాగ్రి జాబితాతో తాము టేకాఫ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి అలా బయలుదేరి వెళ్లిపోయినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కూడా దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications