ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన: ఆ లోటు భర్తీ
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించలేదు. గత నాలుగేళ్లల్లో కురిసిన వర్షాలు ఈ సారి లేవు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావం.. ఈ లోటును అధిగమిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో వర్షాల తీవ్రత మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలియజేశాయి. 14 జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదువుతుందని అంచనా వేశాయి. ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, ఉత్తర కోస్తా రీజియన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీడీఎంఏ తెలిపింది.
పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఇక ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఏపీడీఎంఏ తెలిపింది.












Click it and Unblock the Notifications