AP Rains : ఏపీలో భారీ వర్ష సూచన- సర్కార్ అప్రమత్తం- రాష్ట్రస్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు చర్యలు తీసుకుంటోంది.
నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు వానలు కురుస్తున్నాయి. ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులను ఈ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. వర్షాకాలం రావడంతో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు అప్రమత్తమైంది. జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీంతో అధికారులు తీర ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటుకు సిద్దమవుతున్నారు.

ప్రజలు వారి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని వాతావరణ విభాగం సూచించింది. 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 1070, 18004250101, 08632377118కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని పేర్కొంది.
రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications