మచిలీపట్నంలో భారీ వర్షం: మోకాల్లోతు నీళ్లు- కొట్టుకుపోయిన పాల పాకెట్లు: ఎగబడ్డ జనం
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. అటు ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ఏరియాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.
బంగాళాఖాతం ఉత్తర- మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఈ ఆవర్తనం వాయుగుండగా మారింది. దీని ఫలితంగా మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

విపత్తుల నిర్వహణ విభాగం కూడా భారీ వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
కిందటి నెలతో పోల్చుకుంటే ఈ నెలలో రాష్ట్రంలో గణనీయమైన వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్రలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ నెలలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. వచ్చే కొద్ది రోజుల్లో ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

కాగా- ఈ మధ్యాహ్నం మచిలీపట్నంలో భారీ వర్షం దంచికొట్టింది. ఎడతెరిపినివ్వకుండా భారీ వర్షం కుమ్మేసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు మేర వర్షపు నీరు నిలిచింది. జనజీవనం స్తంభించింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
ఏకధాటిగా కురిసిన వర్షానికి సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న ఓ వాహనం నుంచి పాల పాకెట్ల ట్రేలు కిందపడ్డాయి. పాకెట్లన్నీ వరదనీటిలో తేలియాడుతూ కనిపించాయి. వాటి కోసం స్థానికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications