AP Rains: ఏపీలో భారీ వర్షాలు-కలెక్టర్లు, ఎస్పీల్ని అలర్ట్ చేసిన హోంమంత్రి..!
ఏపీలో వేసవిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఊదురుగాలులతో కూడిన వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఉదయం నుంచి పలు చోట్ల నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వర్షాల కారణంగా జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనిత నేరుగా కలెక్టర్లు, ఎస్పీలను అలర్ట్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత.. వర్షాలపై సమాచారం తీసుకున్నారు. అలాగే తాజా పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు.

వర్షాల నేపథ్యంలో అవసరమైన మేరకు సహాయక చర్యలు అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఆటంకం లేకుండా చూడాలని కూడా మంత్రి వారిని కోరారు. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు స్థానికంగా ఉన్న సిబ్బందిని అలర్ట్ చేస్తూ వర్షాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. వారికి కీలక సూచనలు చేశారు. మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications