పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి మరో సినీహీరో!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడును కొనసాగిస్తున్నాయి. ఈసారి అధికారంలోకి రావడం అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు టిడిపి, జనసేన, బిజెపిల కూటమితో ఎన్నికల కురుక్షేత్రం లోకి దిగారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో పట్టు కోసం జనసేన ప్రయత్నాలు
ఇక గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న జనసేన పార్టీ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసారి చంద్రబాబు సలహాలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక ఇదే సమయంలో జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న చాలామంది ఈసారి పవన్ కళ్యాణ్ కు అండగా ఆయన కోసం ఎన్నికల ప్రచారం చేస్తామని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం నేను సైతం అంటున్న నవదీప్
ఇప్పటికే బాబాయ్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తానని నిహారిక స్పష్టం చేయగా, ఇటీవల విడుదల చేసిన జనసేన స్టార్ క్యాంపెయినర్ లలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, నటులు సాగర్, పృథ్వి, హైపర్ ఆది, గెటప్ శ్రీను, కొరియోగ్రాఫర్ జానీ, క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు ఉన్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కోసం నేను సైతం అంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తానని చెబుతున్నారు సినీ నటుడు నవదీప్.
నిజాయితీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్
పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహా సంస్థానానికి వచ్చిన సినీ నటుడు నవదీప్ శ్రీపాద వల్లభుని దర్శించుకుని ఆపై మాట్లాడారు. నిజాయితీగా ఎవరి పోటీచేసినా ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉన్న నాయకుడని కొనియాడారు. పవన్ కళ్యాణ్ కోసం తాను ఎన్నికల ప్రచారాన్ని చేస్తానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు విలక్షణమైన లక్షణాలు ఉన్నాయని, ప్రజలకు ఎంతో సేవచేయాలనే దృక్పథం ఆయనకుందని హీరో నవదీప్ తెలిపారు.

రాజకీయాల్లో పవన్ వంటి నాయకుల అవసరం ఉంది
సినీ హీరోగా రాణిస్తూనే సమాజ హితం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అలాంటివారు రాజకీయాలలోకి రావలసిన అవసరం ఉందని పేర్కొన్న నవదీప్, పవన్ కళ్యాణ్ అవసరం రాజకీయాలలో ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం తాను నటించిన లవ్ మౌళి సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా నవదీప్ శ్రీపాద వల్లభుడి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications