హైకోర్టులో అయ్యన్నకు రిలీఫ్ - అర్థరాత్రి కూల్చివేతలా : ఛలో నర్సీపట్నం..!!
టీడీపీ సీనియర్ నేత..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రిలీఫ్ దక్కింది. రోజంతా హై టెన్షన్ కు కారణమైన ఇంటి గోడ కూల్చివేత వ్యవహారం పైన అయ్యన్న కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటిజోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నర్సీపట్నంలో ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్న కుమారులు విజయ్.. రాజేష్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ సమయంలో అర్థరాత్రి కూల్చివేతలేంటని ప్రశ్నించింది.

హైకోర్టుకు చేరిన కూల్చివేత వ్యవహారం
తమ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు పిటీషన్ లో కోరారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం చేసినట్లుగా పిటీషన్ లో వివరించారు. అధికారులు పరిశీలన చేసి హద్దులు నిర్ణయించిన తరువాతనే నిర్మాణం చేపట్టామని కోర్టుకు నివేదించారు. కేవలం రాజకీయ కక్ష్యతోనే కూల్చివేతలు మొదలు పెట్టారని ఆరోపించారు. కూల్చివేతలను సూర్యాస్తమయం తర్వాత చేపట్టడానికి వీల్లేదని న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలుండగా ఇదేం పద్ధతని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

అధికారుల పై అసహనం
రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఇప్పటికే కొంతభాగం కూల్చివేత జరిగిందన్నారు. దీంతో విచారణను ఈనెల 21 కి వాయిదా వేసారు. ఇక, ఇదే సమయంలో టీడీపీ ఈ రోజున ఛలో నర్సీపట్నం ఆందోళనకు పిలుపునిచ్చింది. అయ్యన్న ఇంటి గోడ కూల్చటం పైన టీడీపీ అధినేత చంద్రబాబు. .లోకేష్ సహా.. పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

టీడీపీ ఛలో నర్సీపట్నం
అయ్యన్న ఇంటిగోడను కూల్చడాన్ని నిరసిస్తూ.. "చలో నర్సీపట్నం" ఆందోళనకు తెదేపా పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపుతో ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీసీల పట్ల జగన్ చూపిస్తున్న కపట ప్రేమను నిలదీస్తామని అచ్చెన్న వ్యాఖ్యనించారు. గతంలో పల్లా శ్రీనివాస్, సబ్బం హరి ఆస్తులపైనా దాడి చేశారని గుర్తు చేశారు. దీంతో..పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.












Click it and Unblock the Notifications