ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు నడపవు - అందులో జోక్యం చేసుకోవు - రఘురామ పిటీషన్ పై హైకోర్టు..!!
ఆర్థికపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని హైకోర్టు తేల్చి చెప్పింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది. ఏపీ (విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల రెండు చట్టాలను తేవటాన్ని సవాలు చేస్తూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

మధ్యంతర ఉత్వర్వలకు విముఖత
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీని పైన విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఆర్థికపరమైన వ్యవహారాలు, నిర్వహణ తదితరాలన్నీ పూర్తిగా ప్రభుత్వ విచక్షణకు సంబంధించినవని స్పష్టం చేసింది. కొత్త సవరణ చట్టాల ద్వారా సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఆదాయంగా చూపి రుణాలను పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదించారు.

ప్రభుత్వ పరిధిలోని అంశఆలు
ఆర్థికపరమైన వ్యవహారాల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం అమ్మకం ద్వారా పన్నుల రూపంలో వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ఆదాయంగా చూపుతోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సుధాకరరావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆ మొత్తాలను ఆదాయంగా చూపడానికి వీల్లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఈ వ్యాజ్యంపై వేసవి సెలవుల తరువాత విచారిస్తామని పేర్కొంది.

ఆ సంస్థలు వాటిని పరిశీలిస్తాయి
రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ర్థిక పరిస్థితి గురించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), అకౌంటెంట్ జనరల్ (ఏజీ) చూసుకుంటారని, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది కాబట్టే న్యాయస్థానాల జోక్యం కోరుతున్నామని సుధాకరరావు పేర్కొనగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే న్యాయస్థానాలను ప్రభుత్వాలు నడపవని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది.












Click it and Unblock the Notifications