విశాఖపట్నం టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత!!
విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను అడ్డుకునేందుకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నోవాటెల్ కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మద్యనిషేధం గురించి మేనిఫెస్టోలో చెప్పలేదని వెల్లడించిన మంత్రి దగ్గరకు తమను వెళ్లనివ్వాలని, నిరసన తెలియజేస్తామంటూ డిమాండ్ చేశాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిత మంత్రికి మైండ్ లేదంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం ఉందని, అనకాపల్లి ప్రజా సభలో ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. వైసీపీ మేనిఫెస్టో చెత్తకాగితంతో సమానమని, మంత్రి క్షమాపణలు చెప్పేవరకు నిరసన తెలియజేస్తామమంటూ మేనిఫెస్టోను అనిత లైవ్ లో తగలబెట్టారు.

మద్యపాన నిషేధం అనేది తమ పార్టీ మేనిఫెస్టోలో లేదని, దశలవారీగా మద్యం ధరలను 5 స్టార్ హోటల్ స్థాయిలో పెంచి సామాన్యులకు దూరమయ్యేలా చేస్తామని మాత్రమే చెప్పామంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖపట్నంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని గోడలపై వైసీపీ మేనిఫెస్టో ఉంటుందని, కావాలంటే ఒకసారి పరిశీలించుకోవచ్చంటూ మీడియాకు సవాల్ విసిరారు. ఎన్నికల ప్రణాళికలో వెల్లడించినట్లు తాము చేయలేదంటే మీరు ప్రశ్నించవచ్చని, కానీ మా మేనిఫెస్టోను పరిశీలించుకొని అప్పుడు అడగాలన్నారు. ఇప్పుడు ఇదే విషయమై తెలుగుదేశం, జనసేన శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. మేనిఫెస్టోలో వైసీపీ చెప్పింది నిజమా? లేదంటే మంత్రి చెప్పింది నిజమా? అనే విషయంపై ప్రజలకు వివరణ ఇచ్చేవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications