నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలకు హోం మంత్రి తానేటి వనిత వార్నింగ్!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన భద్రత విషయంలో టిడిపి నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత అంటూ పేర్కొన్న ఆమె జైల్లో మావోయిస్టులు ఉన్నా బాబుకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.
చంద్రబాబు ఉన్న బారెక్ కు మావోయిస్టుల బారెక్ చాలా దూరంగా ఉంటుందని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.అంతేకాదు చంద్రబాబు భద్రతకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఇక చంద్రబాబు కోసం ప్రత్యేకంగా చట్టాలను, జైలును రూపొందించలేమని తానేటి వనిత పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇంటి భోజనం అందిస్తున్నామని, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వారి పని వారు చేసుకోవచ్చని హితవు పలికారు.

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు చంద్రబాబు ఉన్న గది పరిసరాలలో సీసీ కెమెరాలు ఉన్నాయని, చంద్రబాబు అనుమతితోనే ఎవరినైనా ఆయన వద్దకు పంపించడం జరుగుతుందని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని సాక్షాలు లేకుండా ఎవరూ అరెస్టు చేయలేరని ఆమె తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పూర్తి ఆధారాలతోనే ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబు ని అరెస్ట్ చేశారని హోం మంత్రి వ్యాఖ్యానించారు.టిడిపి నాయకులు కావాలని అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, కానీ పోలీసులు సంయమనంతో ఉండడం వల్లే ఏపీలో శాంతియుత వాతావరణం ఉందని ఆమె తెలిపారు. చంద్రబాబు విచారణకు సహకరిస్తే అన్ని విషయాలు బయటపడతాయని హోమ్ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
చంద్రబాబుని అరెస్టు చేయడంలో ఎటువంటి కక్షసాధింపు లేదని, కానీ నాటి చంద్రబాబు జగన్ పై కక్షతో కాంగ్రెస్ పార్టీతో కలిసి జైలుకు పంపించారని వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను పదేపదే అరెస్టు చేయాలని చెప్పనక్కర లేదని, నేరం రుజువైతే అతని అరెస్టు కూడా తప్పదని హోమ్ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications