వైఎస్ జగన్ కు హోంమంత్రి వంగలపూడి అనిత షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా హోం శాఖలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఒక ప్రకటన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి.
జగన్ హయాంలో దిశా చట్టం .. దిశా పోలీస్ స్టేషన్లు
గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి, 2019 డిసెంబర్ లో హైదరాబాద్ లో దిశా ఘటన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం చట్ట సవరణ చేసి దిశా చట్టాన్ని తీసుకువచ్చింది. కేంద్రం అనుమతి పొందకుండానే ఆ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన నాటి జగన్ ప్రభుత్వం దానికోసం దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది.

దిశా చట్టం పై హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు
దిశా చట్టం కింద పలు కేసులలో చర్యలు కూడా తీసుకుంటున్నట్టు ప్రకటనలు చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెద్దఎత్తున కొనసాగాయని విమర్శలు వెల్లువగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మారడంతో ఏపీ హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో ఆమె దిశ చట్టానికి చట్టబద్ధత లేదని మహిళల రక్షణ కోసం త్వరలోనే ధీటైన చట్టం తీసుకువస్తామని చెప్పారు.
దిశా పోలీస్ స్టేషన్ ల స్థానంలో మహిళా పోలీస్ స్టేషన్లు
వైసిపి ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. అంతే కాదు దిశ పోలీస్ స్టేషన్ లకు బదులు, 2014లో టీడీపీ హయాంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇది వైసీపీ నేతలకు జగన్ మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి.
దిశా చట్టం కథ కంచికే
దిశా చట్టాన్ని తీసుకువచ్చామని దిశ పేరుతో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని, దిశ యాప్ ద్వారా మహిళలను సమర్ధవంతంగా రక్షిస్తున్నామని చెప్పుకున్న నేపథ్యంలో తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వంలోని హోం మంత్రి వంగలపూడి అనిత దిశా చట్టం పైన, దిశా పోలీస్ స్టేషన్ల పైన చేసిన వ్యాఖ్యలు జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం కథ కంచికే అన్న అభిప్రాయం కలిగేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications