Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అత్యాశతో గుప్త నిధుల తవ్వకాలకు తెగబడిన భార్య...భర్తకు తెలియకుండా ఏకంగా ముఠా ఏర్పాటు;అరెస్ట్

శ్రీశైలం:ఆ దంపతుల స్వస్థలం ఖమ్మం. బ్రతుకు తెరువు కోసం తొలుత ఒక ఇంటర్ నెట్ సెంటర్ పెట్టుకున్నారు. అయితే అది అంతగా నడవకపోతుండటంతో దాన్ని వదిలేసి తమ వద్ద ఉన్న డబ్బుతో ఓ కారు కొని అద్దెకు తిప్పుతున్నారు. వీరికి సంతానం ఒక పాప.

కారు కొన్నప్పటినుంచి జీవితం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగానే సాగిపోతుంది. అయితే దంపతులలో భార్యకు ఈ అరా కొరా సంపాదనతో కూడిన జీవితం నచ్చలేదు. భారీగా డబ్బు సంపాదించాలని...అది కూడా తేలిగ్గా సంపాదిస్తే బాగుండని అనుకుంది. అందుకు గుప్త నిధుల అన్వేషణే పరిష్కారంగా భావించింది. అలా ఆ మార్గంలో ఆమె చాలా ముందుకు వెళ్లిపోయింది. ఎక్కడిదాకా అంటే గుప్తనిధులు తవ్వే గ్యాంగ్ లీడర్ గా పోలీసులు అరెస్ట్ చేసేంతవరకు..!.. వివరాలు ఇవీ.

భారీగా...డబ్బు సంపాదించాలని

భారీగా...డబ్బు సంపాదించాలని

ఖమ్మంకు చెందిన ఫర్జానాకు లగ్జరీగా జీవించాలని ఆశ. ఆమె భర్త దేమో ఉన్నదానితో సరిపెట్టుకుందామనుకునే టైప్ స్వభావం. దీంతో కారును బాడుగకి తిప్పడం ద్వారా వచ్చే ఆదాయం ఆమెకు ఏ మాత్రం తృప్తిని ఇవ్వలేదు. బాగా డబ్బు సంపాదించాలంటే గుప్త నిధుల దొరకబుచ్చుకోవడమే పరిష్కారం అనుకుంది. ఇక ఆ దిశలో అన్వేషణ ప్రారంభించింది. ఇంకేముంది తన లాంటి ఆలోచనలే ఉన్నవారిని గుర్తించి వారితో పరిచయం పెంచుకుంది.

 గుప్తనిధుల కోసం...గ్యాంగ్ లీడర్ అయిన గృహిణి

గుప్తనిధుల కోసం...గ్యాంగ్ లీడర్ అయిన గృహిణి

ఇలా ఆమెకు టి.విద్యాసాగర్‌, వి.ధర్మారావు, షేక్‌.ఇర్ఫాన్‌ అనే వ్యక్తులు పరిచయం కాగా ఏకంగా వారితో కలిసి ఒక ముఠానే ఏర్పాటు చేసింది. అయితే భర్తకి ఈ విషయాలు తెలిస్తే ఊరుకోడని అసలు ఇవేమీ అతడికి తెలియనివ్వలేదు. ఇక ఆ తరువాత గుప్త నిధుల అన్వేషణ ప్రారంభించింది. తమ కారు ఎక్కువగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బాడుగలకు వెళుతుండటంతో అటేమన్నా గుప్త నిధులు ఉండొచ్చా అని ఆరా తీసింది.

అదే అదనుగా...ఆ దొంగ స్వామి

అదే అదనుగా...ఆ దొంగ స్వామి

ఆ క్రమంలో నల్లమల అడవులు, శ్రీశైలం పరిసరాల్లో గుప్త నిధులు వెలికితీస్తాడనే గుర్తింపు పొందిన పాతసున్నిపెంటకు చెందిన తిరుపతి వెంకటస్వామి అనే వ్యక్తి గురించి తెలుసుకొని అతడిని కలసి తన కోరిక వెల్లడించింది. ఇదే అవకాశంగా భావించిన అతడు వనమూలికల సాయంతో గుప్త నిధులు వెలికి తీస్తానని, అందుకు చాలా ఖర్చవుతుందని చెప్పగా...చివరకు రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. ఆ తరువాత అతడు గుప్త నిధులు దొరికే ప్రాంతానికి తీసుకెళతాననగా కారులో మిగిలిన ముఠా సభ్యులు, తన చంటి పాపను తీసుకొని సున్నిపెంటకు చేరుకుంది.

ఆపరేషన్ గుప్తనిధులు...స్టార్ట్

ఆపరేషన్ గుప్తనిధులు...స్టార్ట్

అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ముఠా అంతా కలసి ఆ వెంకటస్వామికి రూ.94,500 అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆ తరువాత రెండు రోజులకి అతడు చూపించిన ప్రాంతం...పాతసున్నిపెంట లలితా పరమేశ్వరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వీరు గుప్తనిధుల కోసం అన్వేషణ సాగిస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వెంకటస్వామి నుంచి రూ.94,500 నగదు స్వాధీనం చేసుకొని కారును సీజ్‌ చేశారు.

చివరకు...పోలీసులు అరెస్ట్

చివరకు...పోలీసులు అరెస్ట్

అనంతరం శ్రీశైలం టూటౌన్‌ పోలీసులు ఈ గుప్త నిధుల ముఠాను మీడియా ముందు హాజరుపర్చి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన షేక్‌.ఫర్జానా, టీ.విద్యాసాగర్‌, వి.ధర్మారావు, షేక్‌.ఇర్ఫాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఠాకు షేక్‌ ఫర్జానానే లీడర్‌ అని...సులభంగా డబ్బు సంపాదించాలని వీరు గుప్తనిధులు అన్వేషణ చేస్తున్నారన్నారు. నిందితులపై ఇండియన్‌ ట్రెజర్‌ ట్రూవ్‌ యాక్ట్‌ 1878, ఏపీ అటవీశాఖ చట్టం 1967 ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు. శ్రీశైలం పుణ్యక్షేత్రమని, ఆ పరిసరాల్లో గుప్తనిధులు దొరుకుతాయన్నది అపోహ మాత్రమేనని...అలాంటి మాయ మాటలు నమ్మి చేటు కొని తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించారు. గుప్తనిధుల కోసం అటవీప్రాంతాల్లో తవ్వినా, వారికి ఎవరైనా సహకరించినా నేరమని...అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కఠిన హెచ్చరికలు జారీచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+