
టీడీపీ-జనసేన పొత్తు కుదరాలంటే ? కీలకంగా చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ ? పవన్ సీఎం పోస్టు ఓకే కానీ..
ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేదా ? అంటే ఉంటుందనే సమాధానం ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు, వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండాల్సిందేనన్న డిమాండ్లు కాపు నేత హరిరామజోగయ్య వంటి వారి నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పొత్తు ఉంటే సరిపోతుందా మిగతా విషయాల్లో ఇరు పార్టీలకు పట్టింపుల్లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఉంటే అవే పొత్తు నిర్ణయించే స్ధాయిలో ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

టీడీపీ-జనసేన పొత్తులో ట్విస్టులు
2014లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంది. ఇప్పుడు 2024 కోసం అంటే సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ ఇరు పార్టీల మధ్య అధికారికంగా మరోసారి పొత్తుకు రంగం సిద్దమవుతోంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్దితుల్లో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రభావం కచ్చితంగా టీడీపీపైనే పడుతోంది. దీనికి కారణం ఈ పదేళ్లలో జనసేన ఎదుగులతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల ఇప్పుడు టీడీపీ-జనసేన రెండోసారి పొత్తు పెటుకున్న విషయంలో రోజుకీ ట్విస్టు కనిపిస్తోంది. పొత్తు ఖాయమనే సంకేతాల్ని ఇప్పటికే ఇచ్చేసిన చంద్రబాబు, పవన్ దానిపై అధికారిక ప్రకటనపై మాత్రం మల్లగుల్లాలు పడటానికి వెనుక ఆ ట్విస్టులే ఉన్నట్లు తెలుస్తోంది.

పొత్తుకు కీలకంగా సీఎం పదవి ?
టీడీపీ-జనసేన మధ్య పొత్తుకు ఈసారి సీఎం పదవి కీలకంగా మారిపోయింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్ధితుల్లో టీడీపీకి ఏకపక్షంగా మద్దతిచ్చి చంద్రబాబును సీఎంను చేసేందుకు ఈసారి జనసేన సిద్ధంగా లేదు. గతంలో తనకు బలమున్నా లేకపోయినా, కాపుల్లో ఉన్న మద్దతుతో చంద్రబాబుతో పాటు మోడీకి కూడా మద్దతిచ్చిన పవన్.. ఈసారి మాత్రం అలాంటి సాహసం చేసేలా కనిపించడం లేదు. దీనికి కారణం చంద్రబాబు గతంలో కంటే బలహీనం కావడం, అదే సమయంలో పెరిగిన జనసేన బలం, మోడీ నుంచి పవన్ కు లభిస్తున్న మద్దతే. దీంతో పవన్ ఈసారి సీఎం పదవి డిమాండ్ చేసే స్ధితిలోకి వెళ్లారు. ఇది అంతిమంగా చంద్రబాబు, లోకేష్ ఆశలపై నీళ్లు చల్లుతోంది.

పవన్ కు సీఎం ఇస్తేనే పొత్తు ?
మారిన పరిస్దితుల్లో పవన్ కళ్యాణ్ కు ఈసారి సీఎం పదవి ఇస్తానంటేనే టీడీపీ-జనసేన పొత్తుకు ఆయన అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు, బలిజ సామాజిక వర్గాలతో పాటు పవన్ ను నమ్ముకున్న ఇతర వర్గాలు కూడా ఇదే డిమాండ్ ను బలంగా తెరపైకి తెస్తున్నాయి. పవన్ ను సీఎంగా చూసే క్రమంలో కాపు సీఎం డిమాండ్ ను ఇతర పార్టీల్లోనూ కాపు నేతలు కూడా తెరపైకి తెస్తున్నాయి. దీంతో ఆయా పార్టీలు సైతం ఇరుకున పడాల్సిన పరిస్దితి. చివరికి ఇదే డిమాండ్ తో జరగాల్సిన కాపునాడు సభ నుంచి చివరి నిమిషంలో ఇతర పార్టీలు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాయి. పవన్ తెలివైన వాడని, సీఎం పదవి ఇస్తానంటేనే పొత్తు పెట్టుకుంటాడని, ఈ విషయంలో చంద్రబాబు వెనక్కితగ్గాల్సిందేనని ఉండవల్లి వంటి మేథావులు సైతం చెప్పేస్తున్నారు.

చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ కీలకం ?
అయితే పవన్ కు సీఎం పదవి ఇచ్చే విషయంలో టీడీపీ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అంతిమంగా చంద్రబాబు ఈ ఈక్వేషన్ కు ఒప్పుకునే అవకాశం ఉంది. కానీ అక్కడే ఓ మెలిక ఉంది. పవన్ కు సీఎం పదవి ముందుగా ఇవ్వాలా లేక తర్వాత ఇవ్వాలా అనేది. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా పోటీ చేసి గెలిస్తే సీఎం పదవిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈసారి పంచుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే దీనికి ఇరువురు నేతలు సై అంటున్నా.. ఇక్కడ ముందుగా ఎవరనేది కీలకంగా మారుతోంది. దీనికి చంద్రబాబు ఫ్లాష్ బ్యాకే కారణమవుతోంది. గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈసారి ముందుగా సీఎం పదవి చేపట్టి, ఆ తర్వాత పవన్ కు హ్యాండిచ్చి అదే పదవిలో కొనసాగితే అప్పుడు తమ పరిస్దితి ఏంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్ధితుల్లో చంద్రబాబు అంతటి సాహసం చేయకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల మాట. దీన్ని గౌరవించి పవన్ కళ్యాణ్ ఇందుకు ఒప్పుకుంటే ఈ పొత్తు ముందడుగు వేయడం ఖాయం.