ఆ రెండు కేసులతో ఏపీ పొలిటికల్ లెక్కలు మారిపోతున్నాయా ?
ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా రెండు కేసుల గురించి జనం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇందులో ఒకటి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కాగా.. మరొకటి వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసు. ఈ రెండు ఘటనలు జరిగి నాలుగేళ్లు దాటిపోయింది. వచ్చే ఏడాదికి ఐదేళ్లు పూర్తవుతాయి. ఈ నాలుగైదేళ్లలో ఈ రెండు కేసుల దర్యాప్తు, విచారణ నత్తనడకన సాగింది. కానీ ఇప్పుడు వేగం పుంజుకుంది. దీంతో ఈ ఈ కేసుల్లో వెలువడే తీర్పులు ఎన్నికలపై మరోసారి తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.
వివేకా హత్య, కోడి కత్తి ఘటనలు గతేడాది ఎన్నికలకు ముందు జరిగాయి. వీటిపై వైసీపీ చేసుకున్న ప్రచారం కారణంగా అప్పట్లో రాజకీయంగా లబ్ది పొందింది. కానీ ఇప్పుడు అవే రెండు కేసుల్లో వైసీపీ రాజకీయంగా మరోసారి లబ్ది పొందే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో విపక్షాలకు కూడా లబ్ది కలుగుతుందా లేదా అనేది ఇంకా తేలడం లేదు. దీంతో ఈ రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయి కోర్టులు ఇచ్చే తీర్పు కోసం విపక్షాలు ఎదురుచూస్తున్నాయి.

వివేకా కేసులో ఓవైపు హైదరాబాద్ సీబీఐ కోర్టు, మరోవైపు తెలంగాణ హైకోర్టు, ఇంకోవైపు సుప్రీంకోర్టులో ఏకకాలంలో విచారణ సాగుతోంది. ఈ కేసులో అనుమానితులు, నిందితులు వరుసగా కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో వివేకా కేసులో వెలువడే తీర్పు ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. అలాగే ఈ కేసులో వైసీపీ నేతల పాత్ర లేదని తేలిపోతే ఎన్నికలకు ముందు ఆ పార్టీకి ఊరట లభించనుంది. అలా కాకపోతే మాత్రం సమస్యలు తప్పవు. అదే జరిగితే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా లబ్ది పొందేందుకు విపక్షాలు కాచుకు కూర్చున్నాయి.

మరోవైపు వైఎస్ జగన్ కోడి కత్తి దాడి కేసులోనూ తాజాగా ఎన్ఐఏ దాఖలు చేసిన కౌంటర్ గమనిస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే రాజకీయంగా ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అప్పుడే విపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ అదంత సులువుగా మాత్రం కనిపించడం లేదు. దీంతో ఈ కేసులో తీర్పు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ రెండు కేసుల్లో వెలువడే తీర్పులు ప్రతికూలంగా వస్తే మాత్రం వైసీపీ-బీజేపీ పరోక్ష పొత్తుపై ప్రభావం చూపడం ఖాయం. అలా కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చినా ఎన్నికల సమయంలో బీజేపీ.. వైసీపీపై రాజకీయ దాడి మొదలుపెడుతుంది. అందుకే జగన్ ఇప్పుడు అన్ని అస్త్రాలకు పదునుపెట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications