శేషాచలం అడవుల్లో పుష్ప సినిమా.. ఏం జరిగిందంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. అడవులను జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా శేషాచలం ఫారెస్ట్ లో కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న అధికారులకు సినీ ఫక్కీలో ముఠాలు చుక్కలు చూపిస్తున్నాయి .
ఎర్రచంద్రనం స్మగ్లర్ల వేట
మొన్నటికి మొన్న కడప జిల్లా ఖాజీపేట మండలంలోని పొద్దుటూరు అటవీ ప్రాంతంలో 53ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరు అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్సు పోలీసులు ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు. కేవలం ఒక్కరిని మాత్రమే పట్టుకోగలిగారు.

అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్ అరెస్ట్
14ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లర్ ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన విష్ణువర్ధన్ కుమార్ టీమ్ రంగంలోకి దిగారు. తిరుపతి హెడ్ క్వార్డర్స్ నుంచి బయలుదేరి అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం పీలేరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు.
కూంబింగ్ లో ఎర్ర చందనం దుంగలను మోసుకెళ్తూ కనిపించిన గ్యాంగ్
ఎల్లమంద చేరుకుని, మంచాల మంద వైపు కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. వీరు మారెళ్ల ఫారెస్టు బీటు పరిధిలోని పింఛానది సమీపం చేరుకునే సరికి కొంత మంది వ్యక్తులు తలలపై ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని హెచ్చరించి చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలను పడేసి పారిపోయారు. సినీ ఫక్కీలో వారిని వెంబడించిన పోలీసులు కేవలం ఒక్క స్మగ్లర్ ను పట్టుకోగలిగారు.
పట్టుబడిన స్మగ్లర్ నుండి కూపీ లాగుతున్న టాస్క్ ఫోర్స్
అతనిని తమిళనాడు, వేలూరు జిల్లా ఆనైకట్టు ప్రాంతానికి చెందిన బలరామన్ పెరియస్వామిగా గుర్తించి అరెస్టు చేశారు. అక్కడ పడి ఉన్న 14ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన వ్యక్తిని, ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు. అతని నుండి కూపీ లాగుతున్నారు. ఈ ఎర్రచందనం గ్యాంగ్ వెనుక ఉన్నవారిని పట్టుకునే పనిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications