రఘురామకృష్ణంరాజుకు సీబీఐ కోర్టు ఝలక్ -జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తిరస్కరణ
వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు అక్రమాస్తుల కేసులో గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ రఘురామరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణార్హం కాదంటూ సీబీఐ కోర్టు తిప్పిపంపింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్ జగన్‌కు గతంలో అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వారం వారం విచారణ జరుగుతున్నా జగన్ మాత్రం కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు కూడా పొందుతున్నారు. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా.. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్ధానం తిప్పిపంపింది.

జగన్‌పై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని, కాబట్టి 11 ఛార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ తన పిటిషన్‌లో కోరారు. ప్రజాస్వామ్యానని రక్షించుకునేందుకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు రఘురామ నిన్న తెలిపారు. జగన్ నిర్దోషిలా బయటపడాలనేదే తన ఉద్దేశమన్నారు. పార్టీని రక్షించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. సొంత పార్టీ అధినేతపై రఘురామ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు.. విచారణ చేపట్టకుండానే తిప్పిపంపింది.












Click it and Unblock the Notifications