
మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే- ఆలోచింపజేసిన పవన్ కల్యాణ్ ప్రసంగం..!!
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రసంగంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెర తీసింది. తాను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ అంగీకరించారాయన. తాను రాజకీయాల్లో విఫలం అయ్యానని స్పష్టం చేశారు. సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న సెమినార్ ఇది.

సహజ శైలికి భిన్నంగా..
శిల్పకళా వేదికలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగించారు పవన్ కల్యాణ్. సాధారణంగా రాజకీయ వేదికల మీద ఆయన కాస్త ఆవేశంతో ప్రసంగిస్తుంటారు. దీనికి భిన్నంగా వ్యవహరించారు. ఎక్కడా ఆవేశపడలేదు. మెచ్చ్యూర్డ్‌గా సాగిందాయన ప్రసంగం. 37 నిమిషాల పాటు ఉపన్యసించారు. అనేక అంశాలను ప్రస్తావించారు.. రాజకీయాలతో సహా. చివర్లో అయిదు నిమిషాలు మినహా మిగిలిన ప్రసంగం చాలావరకు ఇంగ్లీష్‌లో సాగింది.

బలహీన విద్యావ్యవస్థ..
వయస్సు వచ్చినంత మాత్రాన, జుట్టు తెల్లబడినంత మాత్రాన జ్ఞానం వచ్చిందనుకుంటే భ్రమ పడినట్టేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పది సంవత్సరాల లోపు పిల్లలు అత్యున్నతమైన నాలెడ్జ్, ఊహాశక్తి, ఇన్నొవేషన్‌ను కలిగివుంటారని, వ్యవస్థలో ఉన్న పరిస్థితుల వల్ల ఆ జ్ఞనాన్ని మనమే చంపేస్తోన్నామని పేర్కొన్నారు. బలహీనమైన విద్యా వ్యవస్థ దేశంలో ఉందని అన్నారు. మనం ఎవరిని రోల్ మోడల్‌గా తీసుకోదలిచామో వారి గురించి లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. లేకపోతే- తమకు తామే రోల్‌మోడల్‌గా ఎదగాలని కోరారు.

విలువలు అవసరం..
ప్రపంచవ్యాప్తంగా పేరు, గుర్తింపు తెచ్చుకున్నంత మాత్రన వారు గొప్పవారు కాలేరని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. పేరు, డబ్బు ఉన్నంత మాత్రాన విలువలు ఉంటాయని భావించడం పొరపాటే అవుతుందని అన్నారు. విలువలు ఉన్నవారు బయటికి రారని, ఎలాంటి కీర్తి ప్రతిష్ఠల కోసం పాకులాడరని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవ్వర్ని కూడా గుడ్డిగా నమ్మవద్దని పవన్ కల్యాణ్ సూచించారు. చివరికి తాను కూడా చెప్పేదంత నమ్మొద్దని, ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలని అన్నారు.

జీవనాధారం కోసం సినిమాలు..
తన జీవనాధారం కోసం సినిమాలను చేస్తోన్నానని, రాజకీయాలు మాత్రం దేశం కోసం చేస్తోన్నానని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. తాను ప్రస్తుతం విఫలమైన రాజకీయ నాయకుడినని పవన్ కల్యాణ్ అంగీకరించారు. అపజయం తన విజయానికి సగం బాటలు వేసిందని పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే వారి కంటే తాను ఏదో ఒకటి చేసి చూపించానని అది విజయమా? అపజయమా? అనేది తరువాతి విషయమని అన్నారు.

బాధపడట్లేదు..
రాజకీయాల్లో విఫలం అయినందుకు తాను బాధపడట్లేదని, విజయానికి బాటలు పడినట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అతను సాధించిన విజయాన్ని ప్రామాణికంగా తీసుకోలేమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తుఫాన్ తరహా పరిస్థితులను తట్టుకుని ఎలా నిలబడ్డాడనేదే ఆ వ్యక్తి సాధించిన తొలి గెలుపుగా తాను భావిస్తానని, అలాంటి వారే తనకు ప్రేరణ అని చెప్పారు.

మీరు మార్చకపోతే..
ఈ దేశంలో మార్పులను తీసుకొచ్చే శక్తి యువతకు మాత్రమే ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. మార్పును మీరు తీసుకు రాకపోతే ఇంకెవరు తెస్తారని ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా డ్రీమ్ జాబ్ అంటూ ఏదీ ఉండబోదని, అందిన అవకాశాన్ని, ఉద్యోగాన్ని డ్రీమ్ జాబ్‌గా మార్చుకోవాలని సూచించారాయన. తాను ఎంత సాధించానో, ఏమి సాధించానో నిజంగా తెలియదని, దాన్ని ఆడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ ఆడిటింగ్ కోసం భవిష్యత్తులో ఛార్టెడ్ అకౌంటెంట్ల సహాయాన్ని తీసుకోవాల్సి రావొచ్చని నవ్వుతూ అన్నారు.