యూకె ఎంపినైనా, భారత్ అల్లుడినే: బాబుతో డాన్ బైల్స్ భేటీ
హైదరాబాద్: తాను యుకె ఎంపినైనా భారత్ అల్లుడినే అని డేనియల్ బైల్స్ అన్నారు. ఆయన శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసమే కాకుండా స్మార్ట్ సిటీల నిర్మాణానికి యుకె సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి యుకె సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. డేనియల్ బైల్స్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకాపేటకు చెందిన డాక్టర్ ప్రశాంతి రెడ్డిని 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అందుకే, తాను యుకె ఎంపినైనా భారత్ అల్లుడినే అని వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, ఏపీ రాజధాని భూసేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు నారాయణ, పల్లె, రావెల ఇతర అధికారులు సమావేశమయ్యారు. రాజధాని భూసమీకరణ మార్గదర్శకాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఇంకా మార్గదర్శకాలు కొలిక్కి రాలేదని సమాచారం.
భూసేకరణపై మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో చంద్రబాబుతో తుళ్లూరు ప్రాంత రైతులు సమవేశంకానున్నారు. ఇంటిస్థలం, వాణిజ్య స్థలం, ఆదాయం పన్ను మినహాయింపు, రుణాల వన్‌టైమ్ సెటిల్‌మెంట్లపై చర్చించే అవకాశం ఉంది. రైతులతో పాటు సీఆర్‌డీఏ ప్రత్యేకాధికారి శ్రీకాంత్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, మంత్రులు సమావేశంలో పాల్గొననున్నారు. భూసమీకరణపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇస్తారని రైతులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications