రాపాక వర ప్రసాద్ రూటు మారింది..!!
అమలాపురం: జనసేన పార్టీకి చెందిన ఏకైక శాసన సభ్యుడు.. రాపాక వరప్రసాద్. 2019 ఎన్నికల్లో స్వయానా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్- తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దారుణంగా ఓటమి పాలైనప్పటికీ- రాపాక విజయం సాధించడం అప్పట్లో పెను సంచలనం. ఆ తరువాత ఆయన జనసేనకు దూరంగా ఉంటోన్నారు. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలకు హాజరు కావట్లేదు.

కొత్త క్యాండిడేట్..
అటు పార్టీ నాయకత్వం కూడా రాపాకను దాదాపుగా బహిష్కరించింది. ఎలాంటి సమీక్ష సమావేశాలు, రాజకీయ వ్యవహారాల భేటీలకు ఆయనను ఆహ్వానించట్లేదు. సిట్టింగ్ శాసన సభ్యుడే అయినప్పటికీ- రాపాక వరప్రసాద్‌కు మళ్లీ టికెట్ ఇచ్చే ఉద్దేశం కూడా జనసేన పార్టీ అగ్ర నాయకత్వానికి లేదు. ఆయన ఎన్నికైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకునే పనిలో ఉంది.

ఆ కారణంతో..
జనసేన అగ్ర నాయకత్వం రాపాక వరప్రసాద్‌ను దూరంగా పట్టడానికి దీనికి కారణం లేకపోలేదు. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోన్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తోన్నారు. తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ వస్తోన్నారు. పింఛన్ల పంపిణీ మొదలుకుని సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం వరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల సానుకూలంగా ఉంటోన్నారు.

రాపాక రూటు
ఈ వైఖరి జనసేన పార్టీకి నచ్చట్లేదు.. మింగుడు పడట్లేదు. అందుకే ఇక 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాపాకకు టికెట్ ఇవ్వదనేది ఖాయమైంది. ఈ పరిస్థితుల మధ్య ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనేది జిల్లా రాజకీయాల్లో చాలా కాలం నుంచీ వినిపిస్తూ వస్తోన్న ప్రశ్న. రాపాక వరప్రసాద్ రూటు ఎలా మారుతుందనేది చర్చనీయాంశమైంది.

రాజోలు నుంచే..
తాజాగా దీనికి సమాధానం దొరికింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటించారు రాపాక. ఓ యూట్యూబ్ ఛానల్‌తో ఆయన మాట్లాడారు. తన సొంత నియోజకవర్గం రాజోలు నుంచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. అదే సమయంలో రాజోలులో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే- తాను పోటీ చేస్తానని, గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై మరోసారి ప్రశంసలు..
వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాపాక వరప్రసాద్ మరోసారి ప్రశంసల వర్షాన్ని కురిపించారు. పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి అందించడం అద్భుతమని చెప్పారు. వైఎస్ జగన్ ఈ మూడున్నరేళ్లల్లో పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాగలిగారని, అధికార వికేంద్రీకరణ కోసం ప్రయత్నిస్తోన్నారని, ఇది జరిగి తీరాలని చెప్పారు. గత ముఖ్యమంత్రులు పాలనను మండలాల వరకు చేర్చారని, దాన్ని వైఎస్ జగన్ గ్రామాల వరకు, ప్రతి ఇంటి వద్దకూ చేర్చారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications