షాంగై, దుబాయ్ చేస్తా, దేశం గర్వపడేలా: జగన్
పశ్చిమ గోదావరి: విశ్వసనీయత లేని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీని గెలిపించుకుని రాష్ట్రాన్ని సింగపూరే కాదు షాంగై, దుబాయ్‌లను చేద్దామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో వైయస్సార్ జనభేరి సభలో ఆయన మాట్లాడారు.
మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారని ఆరోపించారు. ఇప్పుడు సింగపూర్ చేస్తామని తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారని విమర్శించారు. విశ్వసనీయ లేని నాయకుడంటే చంద్రబాబేనని ఆరోపించారు. ఎన్నికల్లో వాగ్ధానాలు చేసి మర్చిపోవడం బాబుకు అలవాటేనని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర విభజన బిల్లు అన్యాయంగా ఉందని చంద్రబాబు చెప్తే, ఆయన పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో ఆ బిల్లుకే మద్దతు తెలుపుతారని ఆరోపించారు. విభజన బిల్లును అడ్డుకోవడం తమకు సాధ్యం కాలేదని జగన్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు తోడు టిడిపి సహకరించడం వల్లే విభజన జరిగిందని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని జగన్ తెలిపారు. 30 ఎంపి స్థానాలను గెల్చుకుని, కేంద్రంలో తమకు అనుకూలమైన వ్యక్తిని ప్రధాని కూర్చిలో కూర్చోపెడతామని చెప్పారు. రాష్ట్రాన్ని సింగపూర్ కంటే ఎక్కువ అభివృద్ది చేసుకుందామని చెప్పారు. బాబు పాతతరం మనిషని, తాము యువకులం కాబట్టి తమ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు సంతకాలు మొదట పెడతామని చెప్పారు. అక్కా చెల్లెళ్ల కోసం వారి పిల్లలు చదువుకునేందుకు రూ. 500 నుంచి 1000 అందజేస్తామని చెప్పారు. అమ్మమ్మ, తాతయ్యల కోసం రెండో సంతకం, రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మూడో సంతకం, నాల్గో సంతకంతో డ్వాక్రా మహిళా రుణాలను రద్దు చేస్తామని చెప్పారు. మన రాష్ట్రాన్ని చూసి దేశ గర్వపడేలా చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications