నేనేంటో చూపిస్తా, లాస్ట్‌బాల్ ఉంది: టిపై కిరణ్ సంచలనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం మీడియా చిట్‌చాట్‌లో కిరణ్ మాట్లాడారు. సమైక్యాంధ్ర విషయంలో తన నిజాయితీని ఎవరూ శంకించలేరన్నారు. తన సమైక్యవాదంపై ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీకి కౌంటర్ ఇచ్చారు. విభజనపై ఏం జరగబోతుందో చూస్తాం కదా అన్నారు.
తాను అధిష్టానం అజెండాను అమలు చేయడం లేదన్నారు. చివరి బంతికి ఇంకా సమయం ఉందన్నారు. అసెంబ్లీలో తానేంటో నిరూపిస్తానని చెప్పారు. విభజన తుఫానును అడ్డుకుంటానన్న తన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నానని తెలిపారు. బిల్లు విషయంలో రాజ్యాంగబద్దంగా అవకాశాలను వినియోగించుకుంటామని చెప్పారు.

బిల్లుపై సభలో జరిగే చర్చలో ప్రజల మనోభావాలను సభ్యులు ప్రతిబింబింప చేయాలన్నారు. ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల గురించి ఏం చెప్పదల్చుకున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు టేబుల్ మాత్రమే అయిందన్నారు. బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో విభజన సమయంలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరగాలన్నారు.
తాను ఒక ప్రాంతానికి చెందిన ప్రతినిధిగా మాట్లాడటం లేదన్నారు. విభజన జరిగితే సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతం కూడా నష్టపోతుందన్నారు. విభజనతో వచ్చే నష్టాల గురించి తాను కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్ర సమైక్యతపై తన సిన్సియారిటీకి ఎవరి సర్టిఫికేట్ అవకరం లేదని తనను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి అన్నారు.
బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతున్నామన్నారు. సభ్యులు ఏం చెబుతారో ప్రజలకు తెలియాలన్నారు. విభజనపై ఆట అయిపోలేదని, ఇంకా చివరి బంతి ఉందన్నారు. రాష్ట్రం కలిసుండాలో లేక విడిపోవాలో తేల్చేది చట్టసభలే అన్నారు. ప్రజలు నష్టపోతారనే తాను విభజనను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లనే మొదటి రోజు సభకు రాలేదన్నారు. రాజ్యాంగం ప్రకారమే బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలన్నారు. సభ్యులకు ఇవ్వాల్సిన సమయాన్ని సభాపతి నిర్ణయిస్తారన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దీనిపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేస్తామన్నారు.
ఇలా కూర్చోవడం బాగాలేదు
తెలంగాణ టిడిపి నేతలు ఆందోళన చేస్తుండగా కిరణ్ బయటకు వెళ్తున్నారు. వారు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కిరణ్.. ఇలా కూర్చోవడం బాగాలేదని టిటిడిపి నేతలతో అన్నారు. అనంతరం ఆయన మార్షల్స్ సాయంతో బయటకు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications