వాయు"గండం", కుండపోతకు మించి - వర్షాలపై తాజా అప్డేట్స్..!!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అన్ని జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఆ ఉధృతి కుండపోతకు మించి సాగింది. వరుణ ప్రకోపానికి తెలంగాణ వణికిపోయింది. ఏపీలోనూ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఈ రోజు వాయుగుండం ఏర్పాడే అవకాశం ఉంది. దీంతో, మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలలతో అస్తవ్యస్తం:వర్షం తీవ్రత మరోస్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు భారీ వర్షం దెబ్బకు అతలా కుతలం అయ్యాయి. పలు జిల్లాలను వాన కుదిపేసింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం..

అదే ప్రాంతంలో అల్ప పీడంగా మారింది. బుధవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమతో పాటుగా తెలంగాణలోనూ పలు జిల్లాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
మరో మూడు రోజులు:ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అల్లూరి సీతారామరాజు, ఎన్‌టిఆర్, పశ్చిమగోదావరి, పల్నాడు, కర్నూలు, నంద్యాలలో బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని పేర్కొంది. భారీ వర్షాలకు విజయవాడ కస్తూరిబాయిపేటలో కొండచరియలు విరిగిపడి నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముసురు వాన కొనసాగింది. ఈ జిల్లాలోని తూర్పు మండలాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
ఐటీ ఉద్యోగుల లాగౌట్:భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఈ రోజు, రేపు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు పోలీసులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. నగరంలోని ఐటీ కంపెనీలు 3 విడతల్లో లాగ్‌ఔట్ చేయాలని పోలీసులు సూచించారు. ఐకియా-సైబర్ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగ్‌ఔట్ చేయాలని సూచించింది.
ఐకియా-బయోడైవర్సిటీ వరకు ఐటీ కార్యాలయాల్లో సాయంత్రం 4.30 గంటలకు, ఐకియా-రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సాయత్రం 4.30 గంటలకు లాగ్‌ఔట్ చేయాలని సూచించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య లాగ్‌ఔట్ చేయాలని పోలీసులు సూచించారు. గచ్చిబౌలిలోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య లాగ్‌ఔగౌట్ చేయాలని సూచించారు. తద్వారా ట్రాఫిక్ సమస్య కొంత తీరుతుందని సూచన చేసారు.












Click it and Unblock the Notifications