వర్షాలు, వడగాల్పులు - తెలుగు రాష్ట్రాలకు తాజా హెచ్చరికలు..!!
ఒక వైపు వర్షాలు..మరో వైపు వడగాల్పులు. కొన్ని ప్రాంతాల్లో గాలి వాన భీభత్సం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. మరో వైపు అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా గాలివాన కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో రానున్న 24 గంటల్లో వర్షాలతో పాటుగా భారీ ఉష్ణోగ్రతల పై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వడగాల్పులు..వర్షాలు:తెలుగు రాష్ట్రంలో వర్షంతో పాటుగా ఎండ తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఏపీ వ్యాప్తంగా ఈ రోజు (శుక్రవారం) 60 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి, తీవ్ర తుఫానుగా బలపడినట్లు గుర్తించారు. ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫానుగా మారనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తప్పిన తుఫాను ముప్పు:తుఫాను ఆ తర్వాత తన దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీన పడనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఏపీలో గురువారం అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో తీవ్ర వడగాడ్పులతో ఎండలు పెరగనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శనివారం నుంచి కొన్నిచోట్ల 45 డిగ్రీలకు అటూఇటుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏలూరు, ఉమ్మడి తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అప్రమత్తంగా ఉండాలి:రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఇక గత రెండు రోజులుగా నమోదవుతున్న దానికంటే ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో 41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, తెలంగాణలోనూ 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్రమైన వడగాల్పులు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక సూచనలు చేసింది. దీంతో, ఉదయం సమయంలో వడగాల్పులు..సాయంత్రం అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications