అల్ప పీడనం ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు- తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగటంతో పాటుగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ పలు జిల్లాలకు వర్షాల పైన హెచ్చరిక చేసారు. కాగా.. ఈ నెల 15 వరకు ఏపీ, యానాంలో, ఆగస్టు 9 నుంచి 16 వరకు తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ తాజా అంచనాల మేరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజుల్లో కొన్ని చోట్ల లేదా ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురిస్తాయని వెల్లడించారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో మొదటి రెండు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఏపీ, యానాం లోని అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
కాగా, ఆదివారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో ప్రయాణాలు చేసేవారు వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడనం, ద్రోణి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వాతావరణం సాధారణంగా మేఘావృతంగా ఉండటంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.



Click it and Unblock the Notifications