కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం- హైకోర్టుకు వైఎస్ జగన్..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం రేపిన వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు మరోసారి ఎన్నికల ముందు కలకలం రేపేలా కనిపిస్తోంది. ఈ కేసును ఐదేళ్లుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ చివరికి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో తన ఛార్జిషీట్ దాఖలు చేయడం, అందులో ఈ దాడిలో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చేయడం జరిగిపోయాయి. అయితే దీన్ని సవాల్ చేస్తూ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.
వైజాగ్ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు అప్పటి నుంచి జైల్లో మగ్గుతూనే ఉన్నాడు. ఆయనకు ఇప్పటికీ బెయిల్ లభించడం లేదు. శ్రీనివాసరావు బెయిల్ కు అభ్యంతరం లేదని ఎన్వోసీ ఇమ్మని ఆయన తల్లితండ్రులు ఇప్పటికే జగన్ ను కోరారు. అయితే జగన్ విచారణకు కూడా హాజరు రావడం లేదు. దీంతో ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో తెలియడం లేదు.

కోడి కత్తి దాడి కేసులో ఎన్ఐఏ కోర్టులో సమర్పించిన ఛార్జిషీట్ లో ఎన్ఐఏ అధికారులు ఇందులో ఎలాంటి కుట్రా జరగలేదని తేల్చారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ఎన్ఐఏ ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాల్ని తమ దర్యాప్తులో విస్మరించిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జనిపల్లి శ్రీనివాస్ ను వైజాగ్ ఎయిర్ పోర్టులో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నడుపుతున్న హర్షవర్ధన్ తన నేరచరిత్రను చూడకుండా విధుల్లో పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు.
దీంతో ఎన్ఐఏతో మరోసారి సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలో దీనిపై విచారణ జరగనుంది. ఈసారి కోడికత్తి దాడి కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం కూడా ఎన్నికలకు ముందు కీలకంగా మారబోతోంది. దీంతో హైకోర్టు ఎన్ఐఏకు ఏదైనా ఆదేశాలు ఇస్తుందా లేక జగన్ వాదనను తోసిపుచ్చుతుందా, మధ్యలో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ లభిస్తుందా ఇవన్నీ త్వరలో తేలనున్నాయి.












Click it and Unblock the Notifications