టీడీపీతో పొత్తుపై బీజేపీ సీమ నేతల కొత్త ఫిట్టింగ్ - ఇరకాటంలో చంద్రబాబు..!
AP elections 2024: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.
అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

తెలుగుదేశం- జనసేన పొత్తుపై భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా చంద్రబాబు సమీప బంధువు దగ్గుబాటి పురంధేశ్వరి ఉండటమే దీనికి కారణం అనేది తెలిసిన విషయమే. టీడీపీపై గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై గానీ ఈగ వాలనివ్వట్లేదనే పేరు పురంధేశ్వరికి ఉంది. గతంలో విజయసాయిరెడ్డి వంటి వైసీపీ నేతలు చేసిన విమర్శలు దీనికి ఉదాహరణ.
ఈ పరిస్థితుల్లో కొత్త ప్రతిపాదనలు తెరమీదికి తీసుకొచ్చారు.. బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో అధికారంలో ఏ పార్టీ ఉండాలనే విషయాన్ని డిసైడ్ చేసేది తామేనని తేల్చి చెప్పారు. ఎన్నికల నాటికి బలంగా ఎదుగుతామని, ఏపీలో భవిష్యత్ రాజకీయాలను తామే నడిపస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామనే విషయాన్ని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చామని, ఈ సారి కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీకి డజను ఇస్తామని చెప్పడం సరికాదని అన్నారు.
తమతో పొత్తు పెట్టుకోవాలనుకునే ఏ పార్టీ అయినా 75 అసెంబ్లీ, 12 లోక్‌సభ స్థానాలను తమకు కేటాయించాల్సి ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడి హోదాలో తాను ఈ డిమాండ్ పెడుతున్నానని తేల్చి చెప్పారు. చంద్రబాబును డీకే శివకుమార్ కలవడంపై తెలుగుదేశం పార్టీ స్పందించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications